సూర్యుణ్ణి, (Vinayakudu) గణపతిని, శక్తిని, రుద్రుణ్ణి, విష్ణువును పంచభూతాత్మకులని అంటారు. ఒక్కొక్క దైవానికి ఒక్కో విధమైన శక్తి ఉంటుంది. ఈ దైవాలు అందరినీ ఏకకాలంలో పూజించిన ఫలం ఒక్క గణపతిని పూజిస్తే లభిస్తుందనేది పురాణోక్తి. మహారాష్ట్రలోని అష్టవినాయక క్షేత్రాలు చాలా ప్రసిద్ది చెందినవి. పుణె ప్రాంతంలో ఈ క్షేత్రాలున్నాయి. ఆరు పుణె జిల్లాలో ఉన్నాయి.
మయూరేశ్వరుడు
మోర్గావ్ మయూరేశ్వరుడు. ఇది సింధు అనే రాక్షసుణ్ణి (Vinayakudu)వినాయకుడు వధించిన ప్రదేశం. గర్భాలయంలో గణపతి… నెమలిపై ఆసీనుడై దర్శనమిస్తాడు. మూలవిరాట్టుకు ఎదురుగా… పెద్ద మూషికం కాళ్ళతో మోదకాన్ని పట్టుకొని ఉంటుంది. గణపతి శిరస్సుపై పాము పడగ ఉంటుంది.
శ్రీ సిద్ధి వినాయకుడు
సిద్ధిటెక్ లోని శ్రీ సిద్ధివినాయకుడు వెలిశాడు. మధు, కైటభులనే రాక్షసుల సంహార సమయంలో శ్రీహరికి గణపతి సిద్ధి కలుగజేసిన ప్రాంతంగా దీన్ని పరిగణిస్తారు. అందుకే దీన్ని ‘సిద్ధిటెక్ అంటారు. ఇక్కడ వినాయకుడి తొండం కుడివైపు తిరిగి ఉండడం విశేషం. భీమా నదీతీరంలో చిన్న కొండమీద, చుట్టూ కనువిందు చేసే ప్రకృతి మధ్య ఈ ఆలయం ఉంది.
మహాగణపతి
రంజన్ గావ్ లోని మహాగణపతికి ప్రత్యేక స్థానం ఉంది. త్రిపురాసుల సంహారానికి వెళ్ళే ముందు గణపతి కోసం శివుడు ఇక్కడ తపస్సు చేశాడట. ఉత్తరాయణ, దక్షిణాయన సంధి కాలంలో సూర్యకిరణాలు నేరుగా స్వామిపై ప్రసరించేలా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. గర్భాలయంలో రెండు మూలవిరాట్టులుంటాయి. ఒకటి చాలా పెద్దది. రెండోది దాని కింద ఒక అరలో ఉంటుంది. ఈ రెండిటినీ భక్తులు దర్శించుకోవచ్చు.
విఘ్నహర గణపతి
ఓజర్ లోని కుకుడీ నదీ తీరంలో విఘ్నహర క్షేత్రం గణపతి ఉంది. పూర్వం అభినందనుడనే రాజు గణపతి కోసం చేస్తున్న తపస్సును భంగం చెయ్యడానికి విఘ్నాసురుణ్ణి ఇంద్రుడు సృష్టించాడు. ఇది తెలిసిన గణపతి ఆ అసురుణ్ణి ఇక్కడ సంహరించి విఘ్నహర గణపతిగా వెలిశాడని ప్రతీతి. ఇక్కడ స్వామి వారి విగ్రహం తూర్పు అభిముఖంగా ఉంటుంది.
చింతామణి గణపతి
తేయూర్ లోని చింతామణి గణపతిని ఇంద్రుడు, అంగారకుడు అర్చించారనే గాథ ప్రచారంలో ఉంది. మోరయా గోసానీ అనే భక్తుడి తపస్సుకు మెచ్చిన విఘ్నేశ్వరుడు పులి రూపంలో దర్శనం ఇచ్చాడట. దానికి చిహ్నంగా… ఈ ఆలయం ముందు వ్యాఘ్ర రూపం కనిపిస్తుంది. కపిలముని ఈ ఆలయాన్ని నిర్మించాడని, గణపతికి చింతామణిని సమర్పించాడనే పురాణం కూడా ఉంది.
గిరిజాత్మక గణపతి
లేన్యాద్రిపై వెలిశాడు ఈ గిరిజాత్మక గణపతి. వినాయకుడి తలని శివుడు ఖండించినప్పుడు పార్వతి తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఆ దుఃఖాన్ని తొలగించడం కోసం శివుడు గజముఖాన్ని అమర్చి, వినాయకుణ్ణి తిరిగి బతికించాడు. అది జరిగిన ప్రాంతం ఇదేననీ, దానికి సంకేతంగా… గణపతి ఇక్కడ కొండ మీద గజముఖుడిగా కొలువు తీరాడనీ స్థలపురాణం వివరిస్తోంది. ఆలయం ఉన్న కొండ చుట్టూ గుహలు, బౌద్ధారామాలున్నాయి.
భల్లాలేశ్వర గణపతి, పాలీ
భల్లాలుడు అనే బాలుని కోరిక మేరకు భల్లాలేశ్వరుడిగా గణపతి ఇక్కడ వెలిశాడు. ప్రతిరోజూ ఉదయం సూర్యుడి తొలికిరణాలు సభామండపం మీదుగా వచ్చి, గణపతి పాదాలను స్పృశిస్తాయి. ప్రధానమందిరం వెనుక వైపు శ్రీడుండి వినాయక మందిరం ఉంది.
వరద వినాయకుడు, మహడ్
ఇక్కడ వేదకాలం నుంచి గణపతి ఉన్నాడనీ ప్రతీతి. గృత్సమద మహర్షి ఇక్కడి కొలను నుంచి గణపతి విగ్రహాన్ని వెలికి తీసి ప్రతిష్ఠించాడనీ స్థల పురాణం చెబుతోంది. గర్భాలయంలో స్వయంగా స్వామిని పూజిస్తే వరదానం అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం.
Also read;
