Raj Pakala: జన్వాడ ఫాంహౌస్ కేసులో కేటీఆర్ బామ్మర్దికి నోటీసులు

Raj pakala

జన్వాడ ఫాంహౌస్ దావత్ కేసులో పోలీసులు కేటీఆర్ బావమర్ధి (Raj Pakala) రాజ్ పాకాలకు నోటీసులు జారీ చేశారు. రాజ్ పాకాల అందుబాటులో లేకపోవడంతో మోకిలా పోలీసులు గచ్చిబౌలిలోని ఆయన విల్లా డోర్ కు నోటీసులను అతికించారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 35(3) ప్రకారం ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో (Raj Pakala) రాజ్ పాకాలను పోలీసులు ఏ1గా పేర్కొన్నారు. ఏ2గా విజయ్ మద్దూరి పేరును పేర్కొంటూ నోటీసులు జారీ అయ్యాయి. పరారీలో ఉన్న రాజ్ పాకాల.. వెంటనే పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. జన్వాడ ఫాంహౌస్ లో రేవ్ పార్టీ జరుగుతన్నట్టు స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో మొన్న అర్ధరాత్రి దాటాక పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజ్ పాకాల సన్నిహితుడు, ఆయన వ్యాపార భాగస్వామి విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్టు నిర్ధారణ జరిగింది. దీంతో ఆయను ఈ కేసులో పోలీసులు ఏ2గా పేర్కొన్నారు. తాను రాజ్ ఇస్తేనే కొకైన్ తీసుకున్నట్టు విజయ్ చెప్పారని తెలుస్తోంది. పార్టీలోకి కొకైన్ ఎలా వచ్చింది.. ఎవరు సరఫరా చేస్తున్నారు..? అనే అంశాలపై సమగ్ర దర్యాప్తు జరిపే పనిలో పోలీసుశాఖ నిమగ్నమైంది. ఈ దావత్ లో మొత్తం 22 మంది పురుషులు, 16 మంది మహిళలు పాల్గొన్నట్టు పోలీసులు నిర్ధారించారు. వీరిలో రాజ్ పాకాల పరారీలో ఉండగా.. కొకైన్ తీసుకున్నట్టు గుర్తించిన విజయ్ మద్దూరి పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం పార్టీకి హోస్ట్ గా వ్యవహరించిన రాజ్ పాకాలా అలియాస్ రాజేంద్ర ప్రసాద్ ను ప్రశ్నించేందుకు మోకిలా పోలీసులు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం నోటీసులు జారీ చేశారు. ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లగా ఆయన అందుబాటులో లేకపోవడంతో విల్లాకు అతికించారు.

Image

క్యాసినో కాయిన్స్ దొరకడంతో గేమింగ్ యాక్ట్
జన్వాడ ఫాంహౌస్ లో జరిగిన పార్టీలో క్యాసినో కాయిన్స్ దొరకడం గమనార్హం. కేటీఆర్ బావమర్ది సన్నిహితుడు విజయ్ మద్దూరికి కొకైన్ పాజిటివ్ రావడం.. క్యాసినో ఆడుతున్నట్టు ఆనవాళ్లు దొరకడంతో పోలీసులు తెలంగాణ స్టేట్ గేమింగ్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు. ఈ యాక్ట్ లోని సెక్షన్ 3, 4 కింద కేసులు నమోదు చేశారు. భారత దేశంలో క్యాసినో గేమ్ పై నిషేధం ఉంది. అయితే నిషేధిత గేమ్ ను ఆడటం చట్టరీత్యా నేరం అందుకే ఈ యాక్ట్ ను సైతం ఎఫ్​ఐఆర్ లో పొందుపర్చినట్టు సమాచారం.
హైకోర్టులో ఊరట

Image

జన్వాడ ఫాంహౌస్ పార్టీ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేయాలని హైకోర్టును ఆశ్రయించిన కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలకు స్వల్ప ఊరట లభించింది. పోలీసుల ముందు హాజరు కావడానికి కోర్టు రెండు రోజుల టైం ఇచ్చింది. ఆ తర్వాత పోలీసుల విచారణకు హాజరు కావాలని కేసును విచారించిన జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ సూచించింది. అయితే పోలీసుల విచారణకు సంపూర్ణంగా సహకరించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Image

ఇదిలా ఉండగా జన్వాడ ఫాంహౌస్ కేసులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో ఏ2గా ఉన్న విజయ్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కాలేదు. అయితే రెయిడ్ సమయంలో విజయ్ మద్దూరి తన మొబైల్ ఫోన్ దాచి పెట్టి వేరొక మహిళ ఫోన్ అందించినట్టు పోలీసులు గుర్తించారు. దాడులు జరిగిన సమయంలో తన పక్కనే ఉన్న భార్య నంబర్ అడిగితే థర్డ్ పర్సన్ నంబర్ ఇచ్చారని పోలీసులు చెబుతున్నారు. కేటీఆర్ సతీమణిని పోలీసులు విచారించినట్టు సమాచారం. దాడులు జరుగుతున్న సమయంలోనే రాజ్ పాకాల పరారీ అయ్యారని చెబుతున్నారు. రాజ్ పాకాలా, విజయ్ మద్దూరి నోరు విప్పితే అసలు విషయాలు బయటికి వచ్చే అవకాశం ఉందంటున్నారు.

Also read: