Kondagattu : జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయంలో రెండు రోజుల క్రితం చోరీకి పాల్పడిన దొంగల ఆచూకీ లభించినట్లు తెలుస్తోంది. ఆదివారం కర్నాటక రాష్ట్రం బీదర్ ప్రాంతంలో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. దొంగిలించిన వెండి వస్తువులు కొన్నింటిని వారి వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, దొంగతనంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన్నచిన్న కేసుల్లో కూడా నిందితులను గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజీలను మీడియాకు రిలీజ్ చేసే పోలీసులు.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొండగట్టు దొంగతనానికి సంబంధించి ఫొటోలు మాత్రమే విడుదల చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు ఆలయంలో సీసీటీవీ కెమెరాలు పనిచేస్తున్నాయా అన్న అనుమానం భక్తుల్లో నెలకొంది. దొంగతనం జరిగి రెండు రోజులు కావస్తున్నా ఒక చిరుద్యోగిపై చర్యలు తప్ప ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు.
భక్తులను దర్శనానికి అనుమతి ఇచ్చినప్పటి నుంచి భద్రత విషయంలో ఎలాంటి పురొగతి కనిపించడం లేదు. పాత సెక్యూరిటీ స్టాఫ్‌ను అలాగే కొనసాగిస్తున్నారు. ఎలాంటి ప్రాధాన్యం లేనివారిని కూడా అంతరాలయ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఆలయ చరిత్రలోనే మెదటిసారిగా దొంగతనం జరిగిన తర్వాత కూడా ఆలయ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి.

