అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఎగ్జిక్యూటివ్ డెసిషన్ (Indian) భారతీయ విద్యార్థులను కలవర పెడుతోంది. ఉన్నత విద్యకోసం అగ్రరాజ్యానికి వెళ్లిన స్టూడెంట్స్ తాము ఇప్పటి వరకు చేస్తున్న పార్ట్ టైం జాబ్స్ వదులు కుంటున్నారు. అక్రమంగా ఉద్యోగాలు చేసినట్టు ప్రభుత్వం తేల్చితే తమ డిగ్రీ క్యాన్సిల్ కావడంతోపాటు ఆ దేశం నుంచి తిప్పి పంపిస్తారనే భయం వారిని వెంటాడుతోంది. దీంతో వీసా నిబంధనలకు అనుగుణంగా కేవలం చదువులకే పరిమితమవుతున్నారు. పార్ట్ టైం జాబ్స్ కోల్పోవడంతో ఆర్థిక ఇబ్బందుల పాలవుతున్నారు. ఎఫ్–1 వీసాల ప్రకారం (Indian) భారతీయ విద్యార్థులు వారానికి 20 గంటలు మాత్రమే చదువుకొనే క్యాంపస్ పరిధిలో పనిచేసేందుకు అనుమతి ఉంటుంది. 6.50 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఎఫ్–1 వీసాలపై అమెరికాలో స్టడీస్ చేస్తున్నారు.
ఇక్కడి నుంచి ఉన్నత చదువుల కోసం వెళ్లిన వారు అక్కడ కాస్ట్ ఆఫ్ లీవింగ్ ఎక్కువ కావడంతో రెస్టారెంట్లు, గ్యాస్ స్టేషన్లు, పెట్రోల్ బంకులు, రిటైల్ షాపుల్లో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తుంటారు. హైదరాబాద్ కు చెందిన ఓ విద్యార్థి మాట్లాడుతూ.. తాను ప్రస్తుతానికి పొదుపు చేసుకున్న డబ్బులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నానని చెప్పారు. డిగ్రీ రద్దవుతుందని, దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉందన్న వార్తలతో టెన్షన్ పడుతున్నానని అందుకే పార్ట్ టైం జాబ్ ల జోలికి వెళ్లడం లేదని చెప్పారు. ఒక్క సారిగా పార్ట్ టైం జాబ్స్ కోల్పోవడంతో అమెరికాలో చదువుతున్న తెలంగాణ విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటు ఇంట్లో వాళ్లను డబ్బులు అడగలేక, అక్కడ పనిచేయక టెన్షన్ పడుతున్నారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని ఓ విద్యార్థి వెల్లడించాడు. డబ్బులున్న వాళ్లు ఇండ్లకు ఫోన్లు చేసి పరిస్థితి వివరిస్తూ తెప్పించుకుంటుండగా.. లేని వాళ్లు బంధువులు, స్నేహితుల వద్ద అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు అర్ధంతరంగా చదువులు ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చేందుకు రెడీ అయిపోయినట్టు సమాచారం. ఇదిలా ఉండా ఈ ఏడాది ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. విద్యాసంవత్సరం ఆరంభంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు బస్టాండ్ ను తలపించింది. పరిస్థితి ఒక్కసారిగా తారుమారు కావడంతో వాళ్లంతా హైరానా పడుతున్నారు. పరిస్థితి కుదుటపడుతుందని, పూర్వపు రోజులు వస్తాయని హైదరాబాద్ కు చెందిన ఓ విద్యార్థి ఆశాభావం వ్యక్తం చేశారు.
సగం మంది భారతీయులే!
2023లో అమెరికా 3 లక్షల 30 వేల మంది ఎఫ్–1 వీసాలు జారీ చేసింది. అందులో లక్షా 80 వేల మంది స్టూడెంట్స్ ఇండియా నుంచే వెళ్లారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే 30 వేల మంది వరకు వెళ్లి ఉండొచ్చు అని అంచనా ఉంది. 2024 లోనూ అదే స్థాయిలో వెళ్లి ఉంటారనే అంచనా ఉంది.
ఖర్చులకు చాలవు
ఎఫ్–1 వీసా రూల్స్ ప్రకారం వారానికి 20 గంటలే పనిచేయాలి. అలా చేయడం ద్వారా నెలకు లక్ష రూపాయల ఆదాయం వస్తుంది. ఆ డబ్బులు చదువులకు, ట్రాన్స్ పోర్ట్ ఖర్చులకు సరిపోతాయి. కానీ తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకునేందుకు బట్టలకు డబ్బులు కావాలి. దీంతో పైసలెట్లా అనే టెన్షన్ మనోళ్లను వెంటాడుతోంది.

