సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వ కట్టుబడి ఉందని వైద్యారోగ్యశాఖ మంత్రి (Damodara Rajanarasimha) దామోదర రాజనర్సింహా చెప్పారు. ఇవాళ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. అణగారిన వర్గాలకు ప్రమాణాలతో కూడిన విద్య అందాలని ఆకాంక్షించారు. ప్రపంచంలోని ఇతర దేశాల్లో బానిసత్వం, వివక్ష మాత్రమే ఉన్నాయని, మన దేశంలోనే అత్యంత నీచమైన అంటరాని తనం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ, ఆత్మగౌరవం కోసం మహాత్మ జ్యోతిరావు ఫూలె, మహాత్మ గాంధీ, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయులు ఎందరో పోరాటాలు చేశారన్నారు. ఇప్పటికీ చాలా మంది బుడగజంగాలు విద్యకు దూరంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్సీ వర్గీకరణ ఎవరికీ వ్యతిరేకం కాదని, ఇందుకోసం రాష్ట్రంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయని మంత్రి (Damodara Rajanarasimha) గుర్తు చేశారు. గతంలో ఓసారి వర్గీకరణ చేసినా, కోర్టు తీర్పులతో అది నిలిచిపోయిందన్నారు. 1.78 లక్షల జనాభా ఉన్న 26 కులాలు మాత్రమే ఇతర గ్రూపుల్లో చేర్చబడ్డాయన్నారు. మొత్తం మాదిగల్లో ఈ 26 కులాల జనాభా 3.43 శాతమేనని చెప్పారు. మిగిలిన 33 కులాలూ, పాత గ్రూపుల ప్రకారమే కొనసాగుతున్నాయని వివరించారు. అంబేద్కర్ పోరాట ఫలితంగా దళితులకు విద్య, ఉద్యోగాలు, చట్టసభల్లో 15 శాతం రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. విద్యతోనే సమాజ పురోగతి, అభివృద్ధి అని నమ్మిన వ్యక్తి అంబేద్కర్, అందుకే విద్యావకాశాల్లో రిజర్వేషన్లు కల్పించారని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన 15 ఏండ్లకే, 1965లోనే ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు బీఎన్ లోకూర్ కమిటీని అప్పటి ప్రభుత్వం నియమించిందని చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అవసరాన్ని నాడే ఆ కమిటీ గుర్తించిందని మంత్రి దామోదర రాజనర్సింహా చెప్పారు. నాటి నుంచి గతేడాది వరకూ వర్గీకరణ కేసులో సుప్రీంకోర్టులో విచారణ కొనసాగిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ కేసులో అనుకూలంగా వాదించేందుకు ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్‌ను నియమించిందని అన్నారు. సుదీర్ఘ విచారణ, వాదోపవాదనల అనంతరం గతేడాది ఆగస్ట్ ఒకటో తేదీన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మక తుది తీర్పును ప్రకటించిందని వివరించారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్డ్ కులాలను ప్రోత్సహించే చర్యలు తీసుకోవడానికి, చట్టాలను రూపొందించడానికి ఆర్టికల్ 341 అడ్డురాదు.”అని స్పష్టం చేసిందని మంత్రి చెప్పారు. రిటైర్డ్ జడ్జి షమీమ్ అక్తర్ నేతృత్వంలో ప్రభుత్వ కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. పది ఉమ్మడి జిల్లాల్లో కమిషన్ పర్యటించి ప్రజల అభిప్రాయాలు సేకరించిందన్నారు. 8 వేల విజ్ఞాపనలు వచ్చాయని, వాటిని పరిశీలించి 82 రోజుల్లో అధ్యయనం చేసి 199 పేజీల నివేదికను గత నెల 3న ప్రభుత్వానికి సమర్పించిందని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టిందని వివరించారు.

