వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ఈ పవిత్ర సందర్భంగా తెలంగాణ (CM Revanth Reddy) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
వైకుంఠద్వార దర్శనాల కోసం తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతున్న వేళ సీఎం శ్రీవారి సేవలో పాల్గొనడం విశేషంగా నిలిచింది.తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలు తెల్లవారుజాము 1.30 గంటల నుంచే ప్రారంభమయ్యాయి. ఈ ప్రత్యేక దర్శనంలో భాగంగా (CM Revanth Reddy) సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఆయన ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ వాతావరణం భక్తిశ్రద్ధలతో మార్మోగింది.
తిరుమల ఆలయానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేసి వేదాశీర్వచనాలు ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో, శాంతియుతంగా ఉండాలని సీఎం ఈ సందర్భంగా శ్రీవారిని ప్రార్థించినట్లు సమాచారం.
ఇక మరోవైపు హైదరాబాద్ నగరంలోని లంగర్ హౌస్ ప్రాంతంలో ఉన్న శ్రీవేంకటేశ్వర ఆలయాల్లో కూడా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి దంపతులు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయాన్నే ఆలయానికి చేరుకున్న మంత్రి దంపతులు శ్రీవారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.
అర్చకులు మంత్రి వివేక్ వెంకట స్వామి దంపతులకు వేదాశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలను అందజేశారు. ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం చేయడం, శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలదాయకమని భక్తులు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Also read:

