ఏడుగురి దుర్మరణం
PRAKASHAM : పెళ్లి వేడుకలకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. అతివేగంతో దూసుకెళ్లిన బస్సు సాగర్ కెనాల్ వాల్‌ను ఢీకొట్టి అందులో పడిపోయింది. ప్రకాశం జిల్లా దర్శిలో నిన్న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం చెందారు. బస్సు కింద చిన్నారి మృతదేహం ఇరుక్కుపోయినట్టు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మరో 15 మందిని ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 40 మంది ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. పొదిలి నుంచి కాకినాడలో ఓ పెళ్లి రిసెప్షన్‌కు వెళ్లేందుక వీరంతా ఆర్టీసీ బస్‌ను బుక్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మృతులను అబ్దుల్ అజీజ్ (65) అబ్దుల్ హాని (60), షేక్ రమీజ్ (48), ముల్లా నూర్జహాన్ (58), ముల్లా జానీబేగం (65), షేక్ షబీనా (35), షేక్ హీనా(6)గా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.