Eluru district: మెరుపు దాడిలో కోట్లకు చేరువైన వ్యవహారం

Eluru district

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి పేకాట శిబిరాల వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. (Eluru district) ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడు గ్రామంలో నిర్వహిస్తున్న భారీ పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడి చేసి విస్తుపోయే నిజాలను బయటపెట్టారు. హైకోర్టు అనుమతులు ఉన్నాయంటూ నిర్వాహకులు తప్పుడు ప్రచారం చేయడంతో (Eluru district) ఏపీతో పాటు తెలంగాణ నుంచి కూడా వందల సంఖ్యలో జూదరులు ఈ శిబిరానికి తరలివచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

ఆదివారం రాత్రి పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, ప్రత్యేక స్పెషల్ టీమ్‌లతో ఈ పేకాట శిబిరంపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 150 మందికి పైగా పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. అక్కడి నుంచి ఏకంగా రూ.18 లక్షల నగదు, 12కి పైగా కార్లు, సుమారు 50 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా లెక్కించాల్సిన నగదు ఉందని అధికారులు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.పోలీసుల వివరాల ప్రకారం, పోతవరప్పాడులోని ‘మ్యాంగో బే రిక్రియేషన్ సొసైటీ’ని 2011లో ఒక రిక్రియేషన్ క్లబ్‌గా ప్రారంభించారు. మొదట్లో ఆటలు, వినోద కార్యక్రమాల పేరుతో నడిచిన ఈ క్లబ్, క్రమంగా జూదాలకు కేంద్రంగా మారింది. జూదాల ఆరోపణలతో 2014లో ఈ క్లబ్‌ను మూసివేశారు. అయితే ఇటీవల సొసైటీ సభ్యులు కోర్టును ఆశ్రయించి, 13 ముక్కల ఆటకు మాత్రమే అనుమతి తెచ్చుకున్నారని పోలీసులు తెలిపారు.

ఈ అనుమతినే ఆధారంగా చేసుకుని నిర్వాహకులు హద్దులు దాటి పేకాట శిబిరాన్ని నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. హైకోర్టు అనుమతులున్నాయని చెబుతూ, పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో ఖరీదైన కార్లలో ఏపీ, తెలంగాణ నుంచి జూదరులు ఇక్కడికి చేరుకున్నారు. డీఎస్పీ కెవీవీఎన్వీ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, “హైకోర్టు అనుమతులు ఉన్నాయని నిర్వాహకులు తప్పుడు ప్రచారం చేశారు. వాస్తవానికి వారికి అంత పెద్ద స్థాయిలో పేకాట నిర్వహించే అనుమతి లేదు” అని స్పష్టం చేశారు.ఈ పేకాట శిబిరంలో డబ్బును విభజించి మరీ ఆటలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. రూ.10 వేలు, రూ.50 వేలు, రూ.లక్ష వరకు విడివిడిగా టేబుళ్లను ఏర్పాటు చేసి పేకాట సాగించినట్లు విచారణలో తేలింది. అంతేకాదు, రోజుకు దాదాపు రూ.10 లక్షల వరకు నిర్వాహకులు వసూలు చేసినట్లు ప్రాథమిక అంచనా. ఈ లెక్కలు వింటేనే ఈ శిబిరం ఎంత భారీగా నడుస్తోందో అర్థమవుతోంది.

ఇక ఈ వ్యవహారంలో కొందరు ప్రముఖులు కూడా చిక్కుకున్నారనే ప్రచారం జరుగుతోంది. వారందరినీ అదుపులోకి తీసుకుని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఎవరు నిర్వాహకులు? ఎవరు కీలక పాత్ర పోషించారు? రాజకీయ లేదా ఇతర ప్రభావవంతుల అండ ఉందా? అనే కోణాల్లో కూడా విచారణ సాగుతోంది.ఈ ఘటన మరింత సంచలనంగా మారడానికి మరో కారణం ఉంది. ఈ పేకాట శిబిరం బయటపడింది సాక్షాత్తూ మంత్రి పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తున్న నూజివీడు నియోజకవర్గంలోనే. దీంతో రాజకీయ వర్గాల్లోనూ చర్చ మొదలైంది. ప్రతిపక్షాలు ఇప్పటికే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. “మంత్రుల నియోజకవర్గాల్లోనే ఇలాంటి అక్రమాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది?” అంటూ ప్రశ్నలు సంధిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, ఇటీవల ఈ సొసైటీ గేటు వద్ద కొందరు యువకులు పేకాటకు వ్యతిరేకంగా నిరసన కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. అయినా నిర్వాహకులు వెనక్కి తగ్గకపోవడంతో చివరకు పోలీసుల దాడులతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం పోలీసులు కేసులు నమోదు చేసి, పేకాట శిబిరానికి సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.

Also read: