పెట్రోల్ లో నీళ్లు .. అడిగితే కత్తితో దాడి
కూకట్ పల్లి (Kukatpally) : హైదరాబాద్ కూకట్ పల్లి(Kukatpally) పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. సుమిత్రనగర్ హెచ్ పీ పెట్రోల్ బంకు సిబ్బందికి ఓ కస్టమర్ కు మధ్య గొడవ జరిగింది. పెట్రోల్లో నీళ్ళు వస్తున్నాయని నిలదీయడంతో బంకు సిబ్బంది కస్టమర్ పై కత్తితో దాడి చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాధితులను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంక్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, బాధితులకు స్వల్ప గాయాలైనట్టు తెలుస్తోంది
అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హౌస్ అరెస్ట్
జగిత్యాల జిల్లా: ధర్మపురి(Dharmapuri) ప్రజలు నీళ్లు లేక అల్లాడుతుంటే మంత్రి కొప్పుల ఈశ్వర్ దశాబ్ది ఉత్సవాల పేరిట డాన్సులు చేస్తున్నాడని జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో నిరసన తెలిపే స్వేచ్ఛ లేదా అని అడ్లూరి ప్రశ్నించారు. ధర్మపురి(Dharmapuri) లో తాగునీటి కోసం జనం ఇబ్బందులు పడుతున్నందున ఖాళీ బిందెలతో ఆయన ఇవాళ నిరసనకు పిలుపునిచ్చారు. దీంతో లక్ష్మణ్ కుమార్ ను కరీంనగర్ లో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు . తెల్లవారుజామున గొల్లపల్లి ఎస్ ఐ మరో నలుగురు కానిస్టేబుల్ లతో కలిసి కరీంనగర్ వెళ్లి ఆయనను ముందస్తు అరెస్టు చేశారు.
గుర్తింపు సంఘం ఎన్నికలు పెట్టండి: ఆర్టీసీ కార్మికుల నిరసన
భద్రాద్రి కొత్తగూడెం : టీఎస్ఆర్టీసీలో(TSRTC) గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహించాలని డిమాండ్ చేస్తూ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కొత్తగూడెం టీఎస్ఆర్టీసీ(TSRTC) డిపో ఎదుట కార్మికులు ఇవాళ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం, యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. సీసీఎస్ కు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 2017,2021 పెండింగ్ పే స్కేలను అమలు చేయాలని కోరారు. కార్మికులకు రావలసిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలను చెల్లించాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో నేతలు శామ్యూల్,శివరామకృష్ణ, డిపో అసిస్టెంట్ సెక్రటరీ జానీ మియా తదితరులు పాల్గొన్నారు.