సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల(Bonalu) జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. ఆలయాన్ని అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. పూజారులు తెల్లవారుజామునే అమ్మవారికి మహా మంగళ హారతి ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి బోనాల జాతరకు హాజరై ఉజ్జయిని మహంకాళికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం అర్చకులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనాలిచ్చారు.ఆయన వెంట మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో ప్రజలందరికీ మంచి జరగాలని అమ్మవారిని రేవంత్‌రెడ్డి ప్రార్థించారు. అంతకుముందు అమ్మవారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు దర్శించుకుని.. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, తొలి బోనం సమర్పించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు అనుమతించారు. పెద్ద సంఖ్యలో ఆడపడుచులు అమ్మవారికి బోనం సమర్పించేందుకు బారులు తీరారు. దీంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు 6 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. శివసత్తులకు ప్రత్యేకంగా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు ఆర్పీరోడ్, బాట షో రూం నుంచి ప్రవేశం కల్పించారు. ఇవాళ సాయంత్రం ఫలహారం బండి ఊరేగింపు, రేపు14న రంగం, పోతరాజుల గావు, అంబారీపై అమ్మవారి ఊరేగింపు ఉండనుంది.
2,500 మంది పోలీసులతో బందోబస్తు
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల (Bonalu) జాతరలో సుమారు 2,500 మంది పోలీసులు బందోబస్తు చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్, షీ టీమ్స్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. ప్రత్యేకంగా 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దేవాలయానికి భక్తులు వెళ్లేందుకు వివిధ మార్గాల్లో పార్కింగ్ సదుపాయాలు కల్పించారు.
Also read :
Kota Srinivasa Rao: ను చూసి వెక్కి వెక్కి ఏడ్చిన బ్రహ్మానందం
Kota Srinivasa Rao: కన్నీటి పర్యంతమైన బాబు మోహన్