ద్వాదశ జ్యోతిర్లింగాలలో, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి శ్రీశైల(Srisailam) మహాక్షేత్రం. దీనిని శ్రీగిరి(Srisailam) అని శ్రీ పర్వతమని పిలిచేవారు. కాల క్రమేణా అది శ్రీశైల మహాక్షేత్రంగా పరిఢవిల్లుతోంది. మహాశివరాత్రి పర్వదినాన లక్షలాది మంది శివస్వాములు హరహర మహాదేవ అని పరమశివుడిని ప్రార్థిస్తూ నల్లమల అటవీ ప్రాంతం గుండా పాదయాత్ర ద్వారా శ్రీశైల మహాక్షేత్రాన్ని చేరుకుంటారు.
పాతాళ గంగగా ప్రసిద్ధి చెందిన కృష్ణానదిలో స్నానాలాచరించి మల్లికార్జునుడి, ఆ తర్వాత భ్రమరాంబాదేవిని దర్శించుకొని తరిస్తారు. భూమికి నాభిస్థానంగా శ్రీశైలం ఉందని చెబుతారు. అందుకే సంకల్పం చెప్పే సమయంలో శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే, ఈశాన్య ప్రదేశే.. అని చెబుతారు. ఇలా చెప్పడం వల్ల తాము ఎక్కడ నుంచి మహాదేవుడిని స్థుతిస్తున్నామో తెలియజేయడమే అని అంటారు.
స్థల పురాణం
పూర్వం అరుణాసురడనే రాక్షసుడు భూమండలాన్ని పాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపాదాలచే, చతుష్పాదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అంతట అమ్మవారు ప్రత్యకమై అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరంటుంది. తర్వాత దేవతలు పథకం ప్రకారం దేవ గురువు బృహస్పతిని అరుణాసురుని వద్దకు పంపుతారు.
దేవ గురువు బృహస్పతి రాక గురించి తెలుసుకొని అరుణాసురుడు ఆశ్చర్యం చెందుతాడు. బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నామని, కాబట్టి ఈ రాకలో వింత ఏమి లేదంటాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజించాలని గాయత్రి మంత్రం జపాన్ని ఆపేస్తాడు. అంతట కోపానికి వచ్చిన ఆది పరాశక్తి భ్రమర (తుమ్మెద) రూపం ధరించి అసంసాఖ్యకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి. అందుకే ఇక్కడి అమ్మవారిని భ్రమరాంబికా దేవి అని పిలుస్తారు.
Also read:
- INSTAGRAM: ఇన్ స్టా ఆగమైందట.. అరేయ్ ఏం చేశార్రా?
- kazipet: కాజీపేట రైల్వే స్టేషన్లో భారీ అగ్నిప్రమాదం