టెలివిజన్ రంగంలో మంచి గుర్తింపు పొందిన నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’ (BarabarPremistha) విడుదలకు ముందే తీవ్ర వివాదంలో చిక్కుకుంది. (BarabarPremistha) ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చోటుచేసుకున్న సంఘటనపై నటుడు ప్రభాకర్ స్వయంగా స్పందిస్తూ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.
ఈవెంట్ సందర్భంగా చంద్రహాస్ వేదికపై అత్యుత్సాహంతో సినిమాలోని ఓ పాటను తన సొంత పదజాలంతో పాడాడు. అయితే ఆ పాటలో ఉపయోగించిన కొన్ని అనుచితమైన, అసభ్య పదాలు ప్రేక్షకులను తీవ్రంగా అసహనానికి గురిచేశాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సినిమా ప్రమోషన్ పేరుతో అసభ్యతను ప్రోత్సహిస్తున్నారంటూ పలువురు మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో ప్రభాకర్ స్పందిస్తూ, తన కుమారుడు చేసిన పని తప్పేనని అంగీకరించారు. ప్రేక్షకులు, మీడియా ప్రతినిధులు, సినీ వర్గాలందరికీ హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పారు. అయితే ఒక తప్పు కారణంగా మొత్తం కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శించడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభాకర్ క్షమాపణలపై చాలా మంది పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. బాధ్యతాయుతంగా స్పందించినందుకు ప్రశంసలు కూడా వస్తున్నాయి. అయినప్పటికీ చంద్రహాస్‌పై ట్రోలింగ్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. నెటిజన్లు అతడి ప్రవర్తనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
చంద్రహాస్ నట వారసత్వంతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తొలి చిత్రం ‘రామ్‌నగర్ బన్నీ’ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. రెండో సినిమా ద్వారా అయినా ప్రేక్షకుల మనసు గెలవాలని ఆశించిన చంద్రహాస్‌కు ఈ వివాదం పెద్ద దెబ్బగా మారింది. సినిమా విడుదలకు ముందే నెగెటివ్ ప్రచారం జరగడం చిత్ర బృందానికి ఆందోళన కలిగిస్తోంది.
Also read:

