KDrama: కొరియన్ డ్రామా ప్రియులకు చేదు వార్త.

కొరియన్ డ్రామా (KDrama) అభిమానులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చే వార్త వెలుగులోకి వచ్చింది. ప్రముఖ దక్షిణ కొరియా నటుడు జంగ్ యున్ వూ బుధవారం (ఫిబ్రవరి 11) ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు కేవలం 40 ఏళ్లు మాత్రమే కావడం మరింత విషాదకర అంశంగా మారింది. ఆయన మరణాన్ని (KDrama) కొరియన్ మీడియా ధృవీకరించినప్పటికీ, మరణానికి గల ఖచ్చితమైన కారణాలపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Image

జంగ్ యున్ వూ మరణానికి కేవలం ఒకరోజు ముందు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చేసిన కొన్ని పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన దివంగత హాంగ్‌కాంగ్ నటుడు లెస్లీ చియుంగ్ మరియు బ్రిటిష్ గాయని అమీ వైన్‌హౌస్ ఫోటోలను షేర్ చేస్తూ “మిస్సింగ్, అసూయపడుతున్నాను, చింతిస్తున్నాను.. PIR.BG” అనే భావోద్వేగభరితమైన క్యాప్షన్ జోడించారు. ఈ పదాలు అభిమానులను తీవ్రంగా కలిచివేశాయి. ఆయన మనసులో ఏదో వేదన నడుస్తోందా? అనే ప్రశ్నలు ఇప్పుడు నెటిజన్లలో చర్చనీయాంశంగా మారాయి.

Image

అంతకుముందు కూడా ఆయన ఓ ఎర్రటి చంద్రుడి (Red Moon) ఫోటోను షేర్ చేస్తూ “ఎర్రటి చంద్రుడు.. వేలాడదీసినా లేదా వేలాడుతున్నా.. అది ఎలాగైనా పడిపోతుంది” అనే అర్థం కాని వ్యాఖ్యను జోడించారు. ఈ వాక్యాలు ఇప్పుడు మరింత అనుమానాలకు దారితీస్తున్నాయి. ఆయన చివరి పోస్టులను పరిశీలిస్తే, మానసిక ఆందోళనలో ఉన్నారా? లేదా వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఇది కేవలం ఊహాగానాలుగానే ఉన్నాయి.

Image

1986లో దక్షిణ కొరియాలోని ఇన్చియాన్‌లో జన్మించిన జంగ్ యున్ వూ చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి చూపారు. డోంగ్‌గుక్ యూనివర్శిటీలో థియేటర్ అండ్ ఫిల్మ్ విభాగంలో చదువుకుని, 2006లో ‘రౌండప్ 3’ అనే డ్రామాతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మొదట చిన్నపాత్రలతో మొదలైన ఆయన కెరీర్ క్రమంగా వేగం అందుకుంది. ‘స్మైల్ ఎగైన్’ (2011), ‘బ్రైడ్ ఆఫ్ ద సన్’ (2011), ‘ఫైవ్ ఫింగర్స్’ (2012) వంటి డ్రామాలతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు.

Image

‘ఫైవ్ ఫింగర్స్’ సీరియల్‌లో తన అద్భుతమైన నటనకు గాను 2012లో SBS డ్రామా అవార్డ్స్‌లో ‘న్యూ స్టార్ అవార్డు’ అందుకున్నారు. ఆ అవార్డు ఆయన కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది. తన సహజమైన నటన, భావ వ్యక్తీకరణతో ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. కొరియన్ డ్రామా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఆయన ఆకస్మిక మరణం పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టింది.

Image

ప్రస్తుతం అభిమానులు సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. “మేము మిమ్మల్ని మిస్ అవుతాం”, “మీ నటన ఎప్పటికీ మాతోనే ఉంటుంది” అంటూ భావోద్వేగ సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. మరణానికి గల అసలు కారణాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అప్పటివరకు ఈ విషాదం కొరియన్ వినోద రంగాన్ని కుదిపేస్తూనే ఉంటుంది.

Image

Also Read: