iBommaRavi: చంచల్​గూడ జైలుకు ఐబొమ్మ రవి

iBommaRavi

ఐబొమ్మ (iBommaRavi) వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమంది రవిపై నమోదైన పైరసీ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 12 రోజుల పాటు నిర్వహించిన కస్టడీ విచారణ బుధవారం ముగియడంతో, రవిని (iBommaRavi) నేరుగా చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో పోలీసులు అనేక కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది.

కస్టడీ విచారణలో భాగంగా రవి నకిలీ గుర్తింపు పత్రాలు ఉపయోగించిన అంశం వెలుగులోకి వచ్చింది. ప్రహ్లాద్ వెల్లేల అనే వ్యక్తి పేరుతో పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై రవి, ప్రహ్లాద్ తన గత రూమ్మేట్ అని పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు బెంగళూరు నుంచి ప్రహ్లాద్‌ను హైదరాబాద్‌కు పిలిపించి విచారించారు.

అయితే విచారణలో ప్రహ్లాద్ సంచలన విషయాలు వెల్లడించాడు. “రవి ఎవరో నాకు తెలియదు. నా పేరుతో పాన్, లైసెన్స్ తీసుకున్న విషయం తెలిసి షాక్ అయ్యాను” అని పోలీసులకు స్పష్టం చేశాడు. తన డాక్యుమెంట్లు ఎలా దుర్వినియోగం అయ్యాయో తెలియదని చెప్పిన ప్రహ్లాద్, రవి తన వ్యక్తిగత పత్రాలను దొంగిలించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ విచారణను రవి సమక్షంలోనే పోలీసులు నిర్వహించారు.

కస్టడీ సమయంలో పోలీసులు లక్షల్లో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు. హ్యాక్ చేసిన సర్వర్లు, ఉపయోగించిన ఐపీ అడ్రస్‌లు, విదేశీ కనెక్షన్లపై కూడా సైబర్ క్రైమ్ అధికారులు లోతైన విచారణ చేపట్టారు. పైరసీ నెట్‌వర్క్ వెనుక పెద్ద రాకెట్ పనిచేస్తోందన్న అనుమానంతో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

కస్టడీ ముగిసిన అనంతరం రవిని ముందుగా ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు రవిని నేరుగా చంచల్‌గూడ జైలుకు తరలించారు.

ఇదిలా ఉండగా, తనపై వస్తున్న ఆరోపణలపై ఇమంది రవి తీవ్రంగా స్పందించారు. నాంపల్లి కోర్టులో హాజరైన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన, “నా పేరు ఐబొమ్మ రవి కాదు.. ఇమంది రవి. పోలీసులు చెబితే నేరం చేసినట్టా? బెట్టింగ్ యాప్స్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. నా మీద వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం” అని స్పష్టం చేశారు.

తాను ఎక్కడికీ పారిపోలేదని, కూకట్‌పల్లిలోనే ఉన్నానని రవి తెలిపారు. “నేను వేరే దేశంలో సిటిజన్షిప్ మాత్రమే తీసుకున్నాను. సరైన సమయంలో అన్ని వాస్తవాలు బయటపెడతాను. ఏదైనా కోర్టులోనే తేల్చుకుంటాను” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు కేసుకు మరో మలుపు తిప్పే అవకాశముందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ కేసు ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో పైరసీపై మరోసారి చర్చ మొదలైంది. సైబర్ నేరాల నియంత్రణపై కఠిన చర్యలు అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Also read: