నటి రష్మిక మందన్న (Rashmika) స్వస్థలం కర్ణాటకలోని అందమైన కొండ ప్రాంతం కూర్గ్. (Rashmika) ఆమెకు చెందిన కొడవ సామాజిక వర్గంలో పెళ్లి సంప్రదాయాలు ప్రత్యేకతతో నిలుస్తాయి. ఈ సమాజంలో వివాహాన్ని “మంగళ” అని పిలుస్తారు. సాధారణ హిందూ పెళ్లిళ్లలో కనిపించేలా పురోహితులు, హోమాలు, వేద మంత్రాలు ఇవేమీ ఇక్కడ ఉండవు. పెద్దల సమక్షంలో, ప్రకృతి సాక్షిగా, సాదాసీదాగా కానీ గంభీరంగా ఈ వివాహం జరుగుతుంది.
పెళ్లి రోజు ఉదయం వధూవరులు తమ తమ ఇళ్లలో అభ్యంగన స్నానం చేసి సంప్రదాయ దుస్తులు ధరించడం ఆనవాయితీ. వరుడు నల్ల రంగు కోటు ధరించి, నడుముకు ప్రత్యేకమైన పట్టీ కట్టుకుంటాడు. అలాగే చిన్న కత్తిని ధరించడం పరాక్రమానికి ప్రతీకగా భావిస్తారు. వధువు ప్రత్యేకంగా వెనుక వైపు కుచ్చెళ్లు వచ్చేలా కట్టుకునే కొడవ శైలిలో చీరను ధరిస్తుంది. ఈ ప్రత్యేకమైన చీర కట్టే విధానం కొడవ సంప్రదాయానికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తుంది.
వివాహ వేదిక వద్దకు వరుడు చేరుకునే ముందు అరటి చెట్టు కాండాలను నరుకడం ఒక ముఖ్య ఆచారం. ఇది అడ్డంకులను తొలగించి కొత్త జీవితాన్ని ధైర్యంగా ప్రారంభించాలనే సంకేతంగా భావిస్తారు. వధూవరులు పెళ్లి పీటలపై కూర్చున్న తర్వాత కుటుంబ సభ్యులు, బంధువులు ఒక్కొక్కరుగా వచ్చి ఆశీర్వదిస్తారు. ఎటువంటి మంత్రోచ్చారణలు లేకుండా పెద్దల దీవెనలే ప్రధానంగా భావిస్తారు.
ఇక్కడ వధువుకు ఒడిబియ్యానికి బదులుగా చిన్న నాణేల మూటను అందిస్తారు. ఇది సంపద, శుభం, స్థిరత్వానికి ప్రతీకగా భావించబడుతుంది. పెళ్లి అనంతరం వధువు అత్తవారి ఇంటికి వెళ్లినప్పుడు “గంగా పూజ” అనే ఆచారం నిర్వహిస్తారు. వధువు బావి నుంచి నీటిని తోడి, ఆ బిందెను తలపై పెట్టుకుని నడుచుకుంటూ వస్తుంది. ఈ సమయంలో వరుడి కుటుంబ సభ్యులు ఆమెను సరదాగా ఆటపట్టిస్తూ, ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటారు. ఇది ఆమె సహనం, ఓర్పును పరీక్షించే ఆహ్లాదకరమైన ఘట్టంగా నిలుస్తుంది.
కొడవ వివాహ వేడుకల్లో ఆహార విందు కూడా ప్రత్యేకత కలిగిఉంటుంది. సంప్రదాయంగా పంది మాంసం మరియు మద్యం వడ్డించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇది వారి సాంస్కృతిక గుర్తింపులో భాగంగా భావించబడుతుంది. ప్రకృతి మధ్యలో, కుటుంబ బంధాలతో, సంప్రదాయ విలువలను కాపాడుకుంటూ జరిగే కొడవ వివాహాలు ప్రత్యేకమైన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.
Also read:

