RGV: ఒట్టేసిన ఆర్జీవీ

RGV

దర్శకుడు ఆర్జీవీ (RGV) రియలైజ్ అయ్యారు. తన స్వీయ దర్శకత్వంలో 27 ఏండ్ల క్రితం విడుదలైన సత్య సినిమా మరో మారు చూశారు.. ఆ ఘనవిజయాన్ని గుర్తు చేసుకున్నారు. ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఆ సినిమా చూస్తే తనకు కన్నీళ్లు వచ్చాయంటున్నారు. ‘ఒక సినిమాను చిత్రీకరించడమంటే బిడ్డకు జన్మనివ్వడంతో సమానం. సినిమా తీసిన తర్వాత ఇతరులు దాని గురించి ఏం చెబుతారనేది కూడా ముఖ్యమే. రెండు రోజుల క్రితం ‘సత్య’ సినిమా చూసినప్పుడు ఎన్నో విషయాలు గుర్తొచ్చాయి. తాజాగా ఈ సినిమా చూసిన తర్వాత నేను ఈ చిత్రాన్ని బెంచ్‌మార్క్‌గా ఎందుకు పెట్టుకోలేదని అనిపించింది. అలాగే ఈ చిత్రంలోని భావోద్వేగం వల్ల నాకు కన్నీళ్లు రాలేదు. ఇంత గొప్ప జానర్‌ సినిమాను నేనే తీశాను అనే ఆనందానికి వచ్చాయని అర్థమైంది. ఇలాంటి గొప్ప సినిమా చూసి నాపై ఎంతోమంది పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాననే అపరాధభావంతో నాకు కన్నీళ్లు వచ్చాయి’’ అని సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చారు. ‘నేను తాగుబోతును అయ్యాను. మద్యంతోనే కాదు, సినిమాలు ఇచ్చిన విజయం, అహంకారంతో నా కళ్లునెత్తికెక్కాయి.

Image

సత్య’ గొప్పతనం రెండు రోజుల ముందు దాన్ని మరోసారి చూసేవరకూ అర్థం కాలేదు. రంగీలా, సత్యలాంటి చిత్రాలు ఇచ్చిన వెలుగులో నా కళ్లు మూసుకుపోయాయి. దీంతో నా ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీశా. ప్రేక్షకులను ఏదో ఆశ్చర్య పరచాలని, గిమ్మిక్కులతో ఆకట్టుకోవాలని, నాకున్న అతి తెలివితో అసభ్య సన్నివేశాలతో కూడిన సినిమాలు, ఇలా అర్థంపర్థంలేని విషయాలతో కథ, కథనాలపై ఏమాత్రం దృష్టి పెట్టకుండా సినిమాలు తీశా. నా కన్నీళ్లను తుడుచుకుంటూ 2 రోజుల క్రితం ఓ వాగ్దానం చేసుకున్నాను. ఇకపై నేను చేసే ప్రతి సినిమా దర్శకుడిగా నా గౌరవాన్ని పెంచేలా ఉండాలని నిర్ణయించుకున్నా. ‘సత్య’ లాంటి సినిమాను మరోసారి తీయలేకపోవచ్చు. కనీసం ఆ జానర్‌ సినిమాలైనా తీయలేకపోతే నేను సినిమాలకు ద్రోహం చేసినవాడిని అవుతాను’. అని పేర్కొన్నారు ఏదైనా సినిమా తీయాలని నిర్ణయించుకునే ముందు ‘సత్య’ను కచ్చితంగా చూడాలనే నియమాన్ని పెట్టుకున్నానని అన్నారు. ‘ఇప్పటివరకు తీసిన చిత్రాలకు ఈ నియమాన్ని పాటించినట్లైతే 90% చిత్రాలు తెరకెక్కించేవాడిని కాదేమో. చివరగా ఓ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా జీవితంలో ఇంకా సగభాగం మిగిలే ఉంది. దానిని గౌరవంగా పూర్తిచేయాలనుకుంటున్నా. ఈ సత్యాన్ని నా సినిమా ‘సత్య’పై ప్రమాణం చేసి చెబుతున్నాను’’ అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Image

 

Also read: