India US: కీలక పంటలకు అనుమతి లేదు

India US

భారత్–అమెరికా (India US) మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం దేశ రైతులకు ఎలాంటి నష్టం కలిగించదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. వ్యవసాయ రంగాన్ని (India US) అమెరికాకు అప్పగించారంటూ వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తేల్చిచెప్పారు. రైతుల ప్రయోజనాలకు భంగం కలిగే విధంగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని, దేశ వ్యవసాయ రంగం పూర్తిగా సురక్షితంగా ఉందని ఆయన భరోసా ఇచ్చారు.భారత్‌లో సరిపడా ఉత్పత్తి ఉన్న కీలక పంటలు, ఆహార పదార్థాలను ఈ ఒప్పందం నుంచి పూర్తిగా మినహాయించినట్టు గోయల్ తెలిపారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, చేనేత రంగానికి చెందిన వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దేశానికి అత్యంత ప్రాధాన్యత ఉన్న పంటలపై ఎలాంటి రాయితీలు ఇవ్వలేదని, భారత రైతుల ప్రయోజనాలే కేంద్రంగా ఈ ఒప్పందం రూపొందించబడిందని మంత్రి వివరించారు.

Image

తాజా వాణిజ్య ఒప్పందం ప్రకారం, భారత్‌పై అమెరికా విధిస్తున్న సుంకాలు గణనీయంగా తగ్గాయి. ఇప్పటివరకు 50 శాతం వరకు ఉన్న సుంకాలను 18 శాతానికి తగ్గించినట్టు గోయల్ వెల్లడించారు. అదనంగా విధిస్తున్న 25 శాతం సుంకాన్ని పూర్తిగా తొలగించినట్టు తెలిపారు. చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలతో పోలిస్తే, భారత్‌పై అమెరికా విధిస్తున్న టారిఫ్‌లు తక్కువగా ఉన్నాయని ఆయన చెప్పారు. ఇది భారత ఎగుమతులకు పెద్ద ఊతంగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ ఒప్పందం వల్ల భారత్ నుంచి అమెరికాకు వెళ్లే అనేక ఉత్పత్తులకు సున్నా సుంకం వర్తిస్తుందని మంత్రి వివరించారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లతో పాటు మసాలాలు, టీ, కాఫీ, కొబ్బరి, కొబ్బరి నూనె, జీడిపప్పు, పండ్లు, కూరగాయలు వంటి ఉత్పత్తులు ఈ జాబితాలో ఉన్నాయని తెలిపారు. దీనివల్ల భారత ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో మరింత పోటీ సామర్థ్యం పెరుగుతుందని అన్నారు.

Image

అయితే దేశ వ్యవసాయ రంగాన్ని ప్రభావితం చేసే అంశాలపై కేంద్రం ఎలాంటి రాజీ పడలేదని గోయల్ మరోసారి స్పష్టం చేశారు. జన్యుమార్పిడి చేసిన పంటలు, మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులు, పాలు, సోయాబీన్, మక్క, బియ్యం, గోధుమ, చక్కెర, జొన్న, సజ్జ, రాగి వంటి కీలక పంటలను భారత్‌లోకి అనుమతించబోమని తేల్చిచెప్పారు. అలాగే అరటి, స్ట్రాబెర్రీ, చెర్రీ, సిట్రస్ పండ్లకు కూడా ఈ ఒప్పందంలో ఎలాంటి రాయితీలు లేవని పేర్కొన్నారు.ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా భారత్‌లోకి దిగుమతులకు పెద్దగా లాభం లేకపోవడం చూసి, రైతులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొందరు ఆశ్చర్యపోతున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. దేశ రైతుల ప్రయోజనాలు, ఆహార భద్రత, స్వదేశీ ఉత్పత్తుల పరిరక్షణ అన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఈ ఒప్పందం కుదిరిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై రైతుల్లో ఉన్న అనుమానాలకు కొంతవరకు తెరపడినట్టైంది.

Also read: