(Indonesia) ఇండోనేషియాలోని సెంట్రల్ జావా ప్రాంతంలో డిసెంబర్ 22, 2025 తెల్లవారుజామున ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. సెమరాంగ్ నగరంలోని క్రాప్యాక్ టోల్ గేట్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో (Indonesia) బస్సులో భారీగా ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సు అత్యంత వేగంతో ప్రయాణిస్తుండగా క్రాప్యాక్ టోల్ ఎగ్జిట్ కూడలికి చేరుకున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు రోడ్డుపై ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బస్సు పూర్తిగా దెబ్బతినడంతో లోపల ఉన్న వారు బయటకు రావడం కూడా కష్టంగా మారింది.
సమాచారం అందిన వెంటనే సెమరాంగ్ సెర్చ్ అండ్ రెస్క్యూ బృందాలు, పోలీస్ శాఖ, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే బస్సు బోల్తా పడటం, కిటికీల అద్దాలు పూర్తిగా పగిలి లోపల అడ్డంగా పడిపోవడంతో సహాయక చర్యలు కష్టసాధ్యంగా మారాయని అధికారులు తెలిపారు. చాలా మంది బాధితులు బస్సు లోపలే ఇరుక్కుపోయారని, లోపలికి వెళ్లే మార్గాలు మూసుకుపోవడంతో గ్లాస్ ముక్కలను తొలగించి అతి జాగ్రత్తగా రెస్క్యూ చేయాల్సి వచ్చిందని వెల్లడించారు.పలు గంటల పాటు కొనసాగిన సహాయక చర్యల అనంతరం మృతదేహాలను బయటకు తీసి, తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం బాధితులకు చికిత్స కొనసాగుతోందని, కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు ఇండోనేషియా అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న వరుస ప్రమాదాలపై మరోసారి దృష్టి సారించేలా చేసింది. ముఖ్యంగా రోడ్డు భద్రత, వేగ నియంత్రణ, డ్రైవర్ అప్రమత్తత వంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటీవల వరుసగా జరిగిన రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా బస్సు ప్రమాదాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోంది. ఇటీవలే కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురై ఏకంగా 19 మంది మృతి చెందిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరు వద్ద జాతీయ రహదారి 44పై మోటార్ సైకిల్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
Also read:
- Eluru district: మెరుపు దాడిలో కోట్లకు చేరువైన వ్యవహారం
- Medak: సర్పంచ్‌గా గెలిచిన తండ్రి కోసం భిక్షాటన చేసిన కొడుకు

