నూతన సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో స్వాగతించాల్సిన క్షణాలు (Switzerland)స్విట్జర్లాండ్‌లోని ఓ ప్రముఖ పర్యాటక పట్టణంలో ఘోర విషాదంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు న్యూఇయర్ వేడుకల్లో మునిగిపోయిన సమయంలో, (Switzerland) స్విట్జర్లాండ్‌లోని విలాసవంతమైన స్కీ రిసార్ట్ పట్టణం క్రాన్స్ మాంటానాలో భారీ పేలుడు సంభవించి పలువురి ప్రాణాలు బలయ్యాయి. ఈ సంఘటన అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.
స్థానిక పోలీసుల సమాచారం ప్రకారం, న్యూఇయర్ ఈవ్ వేడుకల సందర్భంగా క్రాన్స్ మాంటానాలోని ప్రసిద్ధ ‘కాన్‌స్టెలేషన్ బార్’లో అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటికే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి సుమారు 1.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పేలుడు అనంతరం బార్‌లో భారీగా మంటలు చెలరేగాయి. న్యూఇయర్ వేడుకల్లో భాగంగా సంగీత కార్యక్రమం నిర్వహిస్తుండగా, వంద మందికి పైగా యువత, పర్యాటకులు బార్‌లో ఉన్న సమయంలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం పరిస్థితిని మరింత భయానకంగా మార్చింది.
పేలుడు తీవ్రతకు బార్ భవనం మొత్తం మంటల్లో చిక్కుకుంది. పలువురు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని ప్రాథమిక సమాచారం. గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించినట్లు రెస్క్యూ సిబ్బంది తెలిపారు. మృతుల సంఖ్యపై అధికారికంగా ఇంకా స్పష్టత ఇవ్వలేదని, సహాయక చర్యలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్విస్ పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించిన ధ్రువీకరించని వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో బార్ పూర్తిగా అగ్నికీలల్లో చిక్కుకుని, మంటలు ఎగసిపడుతున్న భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి. బార్ నుంచి బయటకు పరుగులు తీస్తున్న ప్రజలు, అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాల హడావుడి దృశ్యాలు వీడియోల్లో దర్శనమిస్తున్నాయి. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
ఘటనపై స్పందించిన స్విస్ ప్రభుత్వం వెంటనే అత్యవసర సేవలను రంగంలోకి దింపింది. అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. బాధితుల కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే, మృతులు మరియు గాయపడిన వారి వివరాలను ధృవీకరించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, న్యూఇయర్ ఈవ్ వేడుకల్లో భాగంగా నిర్వహించిన సంగీత కార్యక్రమంలో బాణసంచా లేదా పైరోటెక్నిక్ పరికరాల వాడకమే పేలుడుకు కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే పేలుడు అసలు కారణంపై ఇంకా స్పష్టత రాలేదని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ప్రమాదానికి గ్యాస్ లీక్ కారణమా? లేదా విద్యుత్ లోపమా? అనే అంశాలపై కూడా విచారణ కొనసాగుతోంది.
న్యూఇయర్ వేడుకల్లో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించింది. ఆనందంగా మొదలవాల్సిన కొత్త సంవత్సరం, కొందరి జీవితాల్లో శాశ్వత విషాదాన్ని మిగిల్చిందని అంతర్జాతీయ మీడియా వ్యాఖ్యానిస్తోంది.
Also read:

