Pakistan: ప్రార్థనల అనంతరం ఆత్మాహుతి దాడి, 31 మంది మృతి

పాకిస్థాన్ (Pakistan) రాజధాని ఇస్లామాబాద్ మరోసారి ఉగ్రవాద దాడితో దద్దరిల్లింది. శుక్రవారం ప్రార్థనలు ముగిసిన వెంటనే జరిగిన ఆత్మాహుతి దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడిలో 31 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 160 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని (Pakistan) పాకిస్థాన్ అధికారులు వెల్లడించారు. షెహజాద్ టౌన్ పరిధిలోని తార్లై ఇమాంబర్గాహ్ వద్ద ఈ ఘోర ఘటన చోటుచేసుకుంది. ప్రార్థనల అనంతరం భక్తులు ఇమాంబర్గాహ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో, జనసమూహం మధ్యలోనే ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఒక్కసారిగా జరిగిన ఈ పేలుడు ధాటికి పరిసర ప్రాంతాలు దద్దరిల్లగా, అక్కడ ఉన్నవారు భయంతో పరుగులు తీశారు.

Image

పేలుడు జరిగిన వెంటనే సంఘటన స్థలంలో రక్తపాతం నెలకొంది. తీవ్రంగా గాయపడిన వారిని అంబులెన్స్‌ల ద్వారా పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, పాలీక్లినిక్ ఆస్పత్రులకు తరలించారు. ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించి, వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఘటన అనంతరం ఇస్లామాబాద్ నగరమంతా హై అలర్ట్ ప్రకటించగా, భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. పేలుడు జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని, బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలతో తనిఖీలు చేపట్టారు.

Image

ఈ దాడి వెనుక ఉగ్రవాద సంస్థల హస్తం ఉందని భద్రతా సంస్థలు అనుమానిస్తున్నాయి. ముఖ్యంగా బలోచిస్తాన్‌లో పాకిస్థాన్ సైన్యం ఇటీవల ప్రారంభించిన ‘రద్ద్-ఉల్-ఫిత్నా–1’ ఆపరేషన్ నేపథ్యంలో ఈ దాడి జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. జనవరి 26న ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో ఇప్పటి వరకు 216 మంది బలోచ్ తిరుగుబాటుదారులు హతమయ్యారని పాకిస్థాన్ అధికారులు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో 22 మంది భద్రతా సిబ్బంది, 36 మంది పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సైనిక చర్యలకు ప్రతీకారంగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇస్లామాబాద్‌లో గత మూడు నెలల కాలంలో ఇది రెండో ఆత్మాహుతి దాడిగా నమోదైంది. గత ఏడాది నవంబర్‌లో జిల్లా న్యాయ సముదాయం వద్ద జరిగిన పేలుడులో 12 మంది మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు. అప్పట్లో కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించలేకపోయిన దుండగుడు పోలీసు వాహనం సమీపంలో తనను తాను పేల్చుకున్నట్లు పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి వెల్లడించారు. ఆ ఘటన నుంచి ఇప్పటి వరకు భద్రతను కట్టుదిట్టం చేసినప్పటికీ, తాజా దాడి పాకిస్థాన్ భద్రతా వ్యవస్థలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ఈ తాజా దాడితో ఇస్లామాబాద్ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రార్థనా స్థలాలే లక్ష్యంగా మారడం పట్ల మతపరమైన సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించకపోతే, ఇలాంటి ఘటనలు మరింత పెరిగే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకుని, ఉగ్రవాద గూళ్లను ఏరివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Also read: