అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మరోసారి భద్రతా ఉల్లంఘనకు వేదికైంది. ప్రసిద్ధ (WhiteHouse) వైట్‌హౌజ్ నివాస సముదాయానికి సమీపంలోనే కాల్పుల ఘటన చోటుచేసుకుని తీవ్ర ఆందోళనకు కారణమైంది. ఈ (WhiteHouse) ఘటనను అఫ్గాన్ పౌరుడు రహ్మానుల్లా లకన్వాల్ జరిపినట్లు అధికారులు నిర్ధారించారు. కాల్పుల్లో ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యులు తీవ్రమైన గాయాలకు గురయ్యారు, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వెల్లడించారు.
ఈ కాల్పులు స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో నార్త్‌వెస్ట్ డీసీ ఫర్రాగుట్ మెట్రో స్టేషన్ సమీపంలో జరిగాయి. అధికారులు ఇచ్చిన ప్రాథమిక వివరాల ప్రకారం, లకన్వాల్ కొంతసేపు స్టేషన్ వెలుపల వేచి ఉండి, ఒక్కసారిగా డ్యూటీలో ఉన్న మహిళా గార్డ్‌పై దాడి చేశాడు. ముందుగా ఆమె ఛాతిపై గట్టిగా కొట్టి, వెంటనే తలపై కాల్పులు జరిపాడు. సహాయకుల కోసం ప్రయత్నిస్తున్న ఆమెను వదిలిపెట్టకుండా లకన్వాల్ క్రూరంగా కాల్పులు కొనసాగించినట్లు అధికారులు తెలిపారు.
మొదటి దాడి అనంతరం అక్కడే ఉన్న మరో నేషనల్ గార్డ్‌ను కూడా లక్ష్యంగా చేసుకుని లకన్వాల్ కాల్పులు జరిపాడు. దీంతో అతడూ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే, అక్కడ విధుల్లో ఉన్న మరో గార్డ్ వెంటనే స్పందించి నిందితుడిపై కాల్పులు జరపడంతో లకన్వాల్ కూడా గాయపడి కుప్పకూలాడు. అతడిని వెంటనే అదుపులోకి తీసుకోవడంతో మరిన్ని ప్రాణనష్టం తప్పినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడు రహ్మానుల్లా లకన్వాల్ గురించి సమాచారం ఇవ్వాలంటే, 2021లో అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తరువాత, అమెరికా చేపట్టిన ‘ఆపరేషన్ అల్లైస్ వెల్కమ్’ కార్యక్రమంలో భాగంగా అతడు యూఎస్‌కు వలస వచ్చాడు. ఈ కార్యక్రమం కింద వేలాది మంది అఫ్గాన్ పౌరులకు అమెరికా ఆశ్రయం కల్పించిన విషయం తెలిసిందే. లకన్వాల్ వాషింగ్టన్ డీసీలోని బెల్లింగ్‌హామ్ ప్రాంతంలో పునరావాసం పొందుతున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ సంఘటన అనంతరం ఆ కార్యక్రమం కింద వచ్చిన పలు వలసదారుల నేపథ్య పరిశీలనపై ప్రభుత్వం మళ్లీ దృష్టి సారించాల్సిన అవసరంపై చర్చలు మొదలయ్యాయి.
కాల్పుల తర్వాత మొత్తం ప్రాంతాన్ని భద్రతా బలగాలు వెంటనే ముట్టడి చేసి, సమీప రహదారులకు ట్రాఫిక్ నిలిపివేశారు. వైట్‌హౌజ్‌కు సమీప ప్రాంతాల్లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయబడ్డాయి. ఎఫ్‌బీఐ, సీక్రెట్ సర్వీస్, స్థానిక పోలీసులు కలిసి ఈ దాడికి సంబంధించిన పూర్తి నేపథ్యాన్ని వెలికితీయడానికి దర్యాప్తు ప్రారంభించారు. లకన్వాల్ ఒంటరిగా పనిచేశాడా లేదా ఏదైనా మద్దతు ఉందా అన్న విషయాన్ని అధికారులు కీలకంగా పరిశీలిస్తున్నారు.
అమెరికాలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రజా ప్రదేశాల్లో జరుగు గన్ వైలెన్స్ ఘటనలు పెరుగుతూ రావడం వల్ల ఈ ఘటనపై ఆగ్రహం ఉధృతమవుతోంది. ముఖ్యంగా వైట్‌హౌజ్ సమీపంలో ఇలాంటి దాడి జరగడం దేశ భద్రతపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది. గాయపడిన నేషనల్ గార్డులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, వారి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Also read:

