అమెరికా నుంచి వచ్చిన తాజా వార్త భారతీయులను ఆందోళనకు గురి చేస్తోంది. యునైటెడ్ స్టేట్స్‌లోని (California) కాలిఫోర్నియా రాష్ట్రంలో ఇమిగ్రేషన్ చెక్‌పోస్టుల వద్ద భారీ స్థాయిలో నిర్వహించిన తనిఖీల్లో 30 మంది భారతీయులను అరెస్ట్ చేసినట్టు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారికంగా వెల్లడించింది. అక్రమ వలసలు, చట్టవిరుద్ధంగా వాణిజ్య వాహనాల నిర్వహణపై అమెరికా ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది.(California) కాలిఫోర్నియాలోని కీలక ఇమిగ్రేషన్ చెక్‌పోస్టుల వద్ద బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు నవంబర్ 23 నుంచి డిసెంబర్ 12 మధ్య ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 49 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో అత్యధికంగా 30 మంది భారతీయులు ఉండటం విశేషం. ఈ విషయం వెలుగులోకి రావడంతో అమెరికాలో నివసిస్తున్న భారతీయుల్లో ఆందోళన నెలకొంది.
యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ తెలిపిన వివరాల ప్రకారం, అరెస్టయిన వారిలో కొందరు అక్రమంగా అమెరికాలో నివసిస్తున్నట్లు గుర్తించారు. మరికొందరు మాత్రం సరైన కమర్షియల్ ట్రక్ డ్రైవర్ లైసెన్సులు లేకుండా సెమి ట్రక్కులు (హెవీ వాణిజ్య వాహనాలు) నడుపుతున్నట్లు అధికారులు నిర్ధారించారు. అమెరికాలో వాణిజ్య వాహనాలు నడపాలంటే తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ (CDL) ఉండాలి. అయితే ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ పలువురు భారతీయులు ట్రక్ డ్రైవింగ్ చేస్తున్నట్లు తనిఖీల్లో బయటపడింది.
ఈ ఆపరేషన్‌లో బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెంట్లు మొత్తం 42 మంది అక్రమ వలసదారులను ప్రత్యేకంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వీరంతా వాణిజ్య డ్రైవింగ్ లైసెన్సులు లేకుండానే సెమి ట్రక్కులు నడుపుతున్నారని అధికారులు తెలిపారు. ఇది కేవలం ఇమిగ్రేషన్ చట్టాల ఉల్లంఘన మాత్రమే కాకుండా, రహదారి భద్రతకు కూడా తీవ్రమైన ముప్పుగా మారుతుందని అధికారులు పేర్కొన్నారు.
అమెరికాలో ఇటీవలి కాలంలో అక్రమ వలసలపై ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ట్రక్ డ్రైవింగ్, లాజిస్టిక్స్ రంగాల్లో అక్రమంగా పని చేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లో భారీ వాణిజ్య రవాణా జరుగుతుండటంతో, ఈ రంగంలో నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
ఈ అరెస్టుల నేపథ్యంలో అమెరికాలో పనిచేస్తున్న భారతీయులు, ముఖ్యంగా ట్రక్ డ్రైవింగ్ రంగంలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. సరైన వీసా స్థితి, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా పని చేస్తే తీవ్రమైన చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అరెస్టైన వారిని సంబంధిత ఇమిగ్రేషన్ కేంద్రాలకు తరలించి, వారి వీసా స్థితి, నిబంధనల ఉల్లంఘనలపై విచారణ చేపడుతున్నట్లు సమాచారం.
ఈ ఘటన భారతీయ వలసదారులపై అమెరికా ప్రభుత్వం చూపుతున్న కఠిన వైఖరికి మరో ఉదాహరణగా మారింది. అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు, వాణిజ్య వాహనాల నిర్వహణకు పాల్పడకుండా, చట్టబద్ధమైన మార్గాలనే అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే అరెస్టులు, డిపోర్టేషన్ వంటి తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

