అఫ్గనిస్తాన్ (Afghanistan) వరుస భూకంపాలతో తల్లడిల్లుతోంది. కొన్ని గంటల వ్యవధిలోనే పలు సార్లు భూమి కంపించడంతో (Afghanistan) ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. నిన్న ఒక్కరోజే మూడు సార్లు భూమి కంపించగా, గడిచిన 24 గంటల్లో మొత్తం ఏడు భూకంపాలు సంభవించాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
ఈ ప్రకంపనలు ప్రధానంగా పాకిస్తాన్ సరిహద్దులోని హిందూకుష్ పర్వత శ్రేణిలో నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై 4.9, 5.2, 4.6 తీవ్రతతో ఈ భూకంపాలు సంభవించాయి. భూమి నుంచి సుమారు 120 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైన ఈ ప్రకంపనలు భారీ నష్టాన్ని మిగిల్చాయి.
ఇదే కాకుండా, సెప్టెంబరు 1న 6.0 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం అఫ్గనిస్తాన్‌ను అతలాకుతలం చేసింది. ఆ ఘటనలో ఒక్కసారిగా 1,411 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో మూడు వేల మందికి పైగా గాయపడ్డారు. 5,400కు పైగా ఇండ్లు కుప్పకూలాయి. అనేక గ్రామాలు నేలమట్టమయ్యాయి.
సెప్టెంబరు 1 నుంచి నిన్నటి వరకు నమోదైన వరుస ప్రకంపనల కారణంగా ఇప్పటివరకు 2,205 మంది మృతి చెందినట్లు తాలిబన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గాయపడిన వారి సంఖ్య కూడా అధికంగా ఉండటంతో ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోయాయి.
ఈ విపత్తు నేపథ్యంలో అంతర్జాతీయ సాయం అందుతోంది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కునార్, నంగర్‌హర్ ప్రావిన్స్‌లకు అత్యవసర ఆహార సాయం పంపింది. అఫ్గనిస్తాన్‌కు మద్దతుగా భారత్ ముందుకు వచ్చింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో వెల్లడించిన ప్రకారం, ప్రత్యేక విమానం ద్వారా 21 టన్నుల అత్యవసర సహాయక సామాగ్రిని అఫ్గనిస్తాన్‌కు పంపించారు.
వరుస ప్రకంపనలతో ప్రజలు గృహాలను వదిలి బహిరంగ ప్రదేశాల్లో రాత్రులు గడుపుతున్నారు. ఇప్పటికే ఆర్థిక, సామాజిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న అఫ్గనిస్తాన్, ఈ ప్రకృతి విపత్తుతో మరింత దెబ్బతిన్నది. పునరావాస పనులకు భారీ వనరులు అవసరమని, అంతర్జాతీయ సహకారం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం అఫ్గనిస్తాన్‌లో పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరుగుతూనే ఉండటంతో మరిన్ని దేశాలు సహాయక హస్తం అందించాలని అంతర్జాతీయ సమాజం కోరుతోంది.
Also read:
- Mahesh Kumar Goud: రిజర్వేషన్లు తేలాకే స్థానిక సంస్థల ఎన్నికలు
- Balapur Ganesha: బాలాపూర్ లడ్డూ రికార్డుపై ప్రశ్నార్థకం

