రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయ రంగానికే సింహభాగం నిధులు కేటాయించినట్టు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇవాళ అసెంబ్లీలో(Assembly) ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు. జవహర్ లాల్ నెహ్రూ మాటలను కోట్ చేస్తూ అన్నదాతకు పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు. మొత్తం 2,91,159 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన భట్టి.. వ్యవసాయ రంగానికే 72,659 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ఇది రైతుల తలరాతలు మార్చే చరిత్రాత్మక నిర్ణయమన్నారు. దేశ చరిత్రలో వ్యవసాయ రంగానికి ఇది ఒక మైలురాయి అని తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. రైతు భరోసా సహా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతాం. బడ్జెట్ కేవలం అంకెల సమాహారం కాదు. విలువలు, ఆశల వ్యక్తీకరణ కూడా. జిల్లాల మధ్య ఆదాయ అంతరాలు తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అసమానతలు లేని సమసమాజ స్థాపన దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాదిలోనే రైతు కూలీలకు రూ.12వేలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు చెప్పారు. పీఎం ఫసల్ బీమా యోజనలో చేరాలని నిర్ణయించాం. రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. పైసా ఖర్చు లేకుండా పంటలకు పూర్తి భద్రత కల్పిస్తాం. వరి రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఆయిల్ పామ్ రైతులకు సహకారం అందిస్తామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఇందుకోసం లక్షరూపాయల చొప్పున రుణాలు ఇవ్వనున్నామని అన్నారు. ఇందుకోసం మహిళాశక్తి క్యాంటిన్లను విస్తృతంగా ఏర్పాటు చేస్తామని, ఆర్థిక చేయూతను అందిస్తామని తెలిపారు. మహిళల ఉచిత ప్రయాణానికి రూ. 723 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. రూ. 500 కే గ్యాస్ సిలిండర్ల కోసం ఉద్దేశించిన గృహ జ్యోతి పథకానికి 2,418 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని రైతు రుణమాఫీతో రుజువు చేశామని చెప్పారు. ప్రజావాణి సమస్యల మానిటరింగ్ కోసం ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించనున్నట్టు తెలిపారు. లోపభూయిష్టమైన ధరణి వల్ల చాలా మందికి రైతుబంధు, రైతుబీమాలను కూడా చాలామంది రైతులు అందుకోలేకపోయారన్నారు. ధరణి పోర్టల్ వల్ల వచ్చే సమస్యల పరిష్కారానికి ఒక కమిటీని వేశామని,
కమిటీ అధ్యయనం పూర్తయ్యాక సరైన నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించారు. విశ్వనగరంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ కోసం ప్రత్యేకంగా 10 వేల కోట్లను కేటాయిస్తున్నట్టు భట్టి ప్రకటించారు. రాష్ట్రంలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపేందుకు చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నామని, ఇందుకోసం హోంశాఖకు రూ.9564కోట్ల కేటాయించినట్టు తెలిపారు.
ALSO READ :

