దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాలేగావ్ పేలుడు కేసులో ముంబైలోని ప్రత్యేక కోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ( Malegaon blast) కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్, లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ సహా మొత్తం ఏడుగురినీ నిర్దోషులుగా తేల్చింది. ఈ మేరకు ఇవాళ తీర్పు వెలువరించింది. ఈ కేసు దర్యాప్తు, ప్రాసిక్యూషన్ వాదనలో చాలా లోటుపాట్లు ఉన్నాయని కోర్టు తెలిపింది. ఈ కేసుకు ఉపా చట్టం వర్తించదని పేర్కొంది. ఈ పేలుడుకు వినియోగించిన మోటార్‌బైక్ మాజీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ పేరు మీద రిజిస్టర్ అయిందని ప్రాసిక్యూషన్ చేసిన వాదనకు తగిన సాక్ష్యాధారాలు లేవని కోర్టు తెలిపింది. బైక్‌కు అమర్చిన బాంబు వల్లే పేలుడు సంభవించిందని చెప్పేందుకు కూడా ఆధారాల్లేవని చెప్పింది. ఉగ్రవాదానికి మతం లేదని, ఏ మతం కూడా హింసను ప్రోత్సహించదని వ్యాఖ్యానించింది. కేవలం ఊహాగానాలు, నైతిక ఆధారాలతో ఎవరినీ కోర్టులు శిక్షించవని పేర్కొంది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ మినహా ఈ కేసులో ఎలాంటి బలమైన ఆధారాల్లేవని వెల్లడించింది.( Malegaon blast)
2008నాటి సంఘటనే కేసు
మహారాష్ట్ర లోని నాసిక్ జిల్లా మాలేగావ్ ప్రాంతంలో 2008 సెప్టెంబరు 29న పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఆరుగురు మరణించారు మరియు వంద మందికి పైగా గాయపడ్డారు. మోటార్‌సైకిల్‌కు అమర్చిన బాంబు పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పట్లో ఈ కేసు పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై ప్రజ్ఞా ఠాకూర్, పురోహిత్‌తో పాటు రమేశ్ ఉపాధ్యాయ్, అజయ్ రహీర్‌కార్, సుధాకర్ ద్వివేది, సుధాకర్ చతుర్వేది, సమీర్ కులకర్ణి ప్రధాన నిందితులుగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు దర్యాప్తు బాధ్యతలను ఎన్‌ఐఏ స్వీకరించింది. ఈ కేసులో 220 మంది సాక్షులను విచారించగా వారిలో 15 మంది అంతకుముందు తాము ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా మాట్లాడటం గమనార్హం.
Also Read :

