Bandi Sanjay: అన్ని పథకాలకు నిధులిస్తున్నది కేంద్రమే

Bandi Sanjay Kumar
  • తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం
  • ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు బుద్ది చెప్తారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్(Bandi Sanjay)
  • వాళ్లు ఇస్తున్నది కేవలం మూడు పథకాలే

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అనేక నిధులు ఇస్తున్నది. ఇక్కడ ప్రభుత్వం వాటితో చేస్తున్నది బ్రోకరిజమేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) అన్నారు. గ్రామీణ సడక్ యోజన, జాతీయ రహదారుల అభివృద్ధి, రైల్వే ప్రాజెక్టులు, కొత్త లైన్లు, రైతువేదికల ఏర్పాటు, ఉచితంగా రేషన్ బియ్యం, వైకుంఠధామాల నిర్మాణాలన్నీ కేంద్రం నిధులతోనే సాగుతున్నాయని చెప్పారు. ఉపాధి హామీ, పంచాయతీలకు నిధులు సైతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదని వివరించారు. రైతులు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేస్తున్నది కూడా కేంద్ర ప్రభుత్వమేనని చెప్పారు.

ఈ విషయం తాను ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొనుగోలు కేంద్రాల పరిశీలన సమయంలో తేటతెల్లమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం మూడు పథకాలనే అమలు చేస్తున్నదని చెప్పారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు పథకాలనే ఇస్తున్నదని అన్నారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టోయిన రైతులకు కనీసం పరిహారం ఇవ్వలేని పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. తాను బీఆర్ఎస్ కు ఓటెయ్యాలని చెప్పినట్టు ఓ పత్రిక రాసిందని, తాను అన్నది వేరు.. ఆ పత్రిక రాసింది వేరన్నారు. ఉద్యోగులకు ఫస్ట్ తేదీన జీతాలు ఇస్తే.. టీచర్లకు ప్రమోషన్లు ఇస్తే , 30 లక్షల మంది నిరుద్యోగులకు కొలువులు ఇచ్చి ఉంటే బీఆర్ఎస్ కు ఓటు వేయాలని చెప్పానని అన్నారు. దానిని ఆ పత్రిక వక్రీకరించిందని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి పూర్తి అనుకూల వాతావరణం ఉందని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బండి సంజయ్ తెలిపారు. బీజేపీకి ప్రజల మద్దతు లేకుంటే దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచేదా…? జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 కార్పొరేటర్ సీట్లు సాధించేదా..? అని ప్రశ్నించారు. ఈ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.

Also Read: