(America) అమెరికాలో మరోసారి భారత సంతతి వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. డల్లాస్ నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన (America) అమెరికాలోని తెలుగు, భారతీయ సమాజంలో తీవ్ర కలకలం రేపింది. వాషింగ్ మెషీన్ వాడకం విషయంలో ప్రారంభమైన చిన్న వివాదం చివరకు అమానుష హత్యకు దారి తీసింది.
తెలంగాణకు చెందిన చంద్రమౌళి నాగమల్లయ్య (50) కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. జీవనోపాధి కోసం ఆయన డల్లాస్ డౌన్‌టౌన్‌లోని లాడ్జిలో పనిచేస్తున్నారు. అయితే అక్కడే పనిచేస్తున్న మార్టినెజ్ అనే వ్యక్తితో వాషింగ్ మెషీన్ వినియోగంపై తగాదా జరిగింది. మొదట మాటల యుద్ధంగా ప్రారంభమైన ఈ గొడవ కొద్దిసేపటికే తీవ్ర హింసకు దారితీసింది.
కోపం కోల్పోయిన మార్టినెజ్ పదునైన కత్తిని తీసుకొని నాగమల్లయ్యపై దాడి చేశాడు. నాగమల్లయ్య భార్య, కుమారుడు ఎంతో వేడుకున్నా కనికరించలేదు. కత్తితో దారుణంగా దాడి చేసి ఆయన తలను నరికేసి పక్కకు విసిరేశాడు. ఈ భయంకర దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో సంఘటన తర్వాత వెంటనే వెలుగులోకి వచ్చాయి.
ఈ ఘటనతో అక్కడి ప్రజలు షాక్‌కు గురయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న డల్లాస్ పోలీసులు తక్షణమే పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. నిందితుడు మార్టినెజ్‌ను అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. అతనిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని, అమెరికాలో పనిచేస్తున్న భారత సంతతి వ్యక్తులు భయాందోళనకు గురవుతున్నారని సమాజ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత రాయబార కార్యాలయం కూడా ఈ సంఘటనపై అమెరికా అధికారులను సంప్రదించినట్లు సమాచారం. నాగమల్లయ్య కుటుంబానికి సహాయం అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
తెలుగు కమ్యూనిటీ నాయకులు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. చిన్న విషయాలకే ప్రాణాలు తీసే స్థాయికి వెళ్లడం బాధాకరమని అన్నారు. అమెరికాలో పనిచేస్తున్న భారతీయులు జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి వివాదాలను నివారించాలని సూచించారు.
నాగమల్లయ్య మరణంతో కుటుంబం కన్నీర్లో మునిగిపోయింది. భార్య, కుమారుడు కన్నెముకలమైపోయారు. ఈ ఘోరానికి న్యాయం జరగాలని, కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also read:

