దేశంలో మహిళల సాధికారత దిశగా అనేక రాష్ట్రాలు వివిధ రకాల పథకాలను అమలు చేస్తున్న తరుణంలో, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకురాగా, ఇప్పుడు (AP) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే బాటలో అడుగులు వేస్తూ మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా కొత్త పథకాలను ప్రవేశపెడుతోంది. ముఖ్యంగా నిరుద్యోగ మహిళలు, పేద వర్గాలకు చెందిన మహిళలు స్వయం ఉపాధితో నిలదొక్కుకునేలా ప్రభుత్వం రూపొందించిన తాజా పథకం ‘ఉచిత ఎగ్ మార్ట్ లేదా ఎగ్ కార్ట్ స్కీమ్’, ప్రస్తుతం (AP) రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందనను పొందుతోంది.
![]()
ఈ ఉచిత ఎగ్ మార్ట్ స్కీమ్ ద్వారా మహిళలు సొంతంగా గుడ్ల వ్యాపారం ప్రారంభించేందుకు పూర్తిస్థాయిలో ప్రభుత్వం సహకారం అందిస్తోంది. నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (NECC) మరియు మెప్మా (MEPMA) సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తుండగా, ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఎగ్ మార్ట్‌లు ప్రారంభమై, మహిళలు వ్యాపార కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. ఈ పథకం ద్వారా కేవలం ఉపాధి మాత్రమే కాకుండా, దీర్ఘకాలికంగా ఆర్థిక అభివృద్ధి సాధించే అవకాశం మహిళలకు లభిస్తోంది.
ఈ స్కీమ్ ప్రత్యేకత ఏమిటంటే, ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా సుమారు రూ.50,000 విలువైన సామాగ్రిని అందించడం. ఇందులో గుడ్లను అమ్మేందుకు ఉపయోగించే మొబైల్ ఎగ్ కార్ట్ లేదా బండి విలువ సుమారు రూ.35,000 కాగా, ప్రారంభ దశలో వ్యాపారం మొదలుపెట్టేందుకు గుడ్ల స్టాక్ కోసం మరో రూ.15,000 అందిస్తుంది. అంతేకాకుండా, గుడ్లతో పాటు బోయిల్డ్ ఎగ్, ఎగ్ ఆమ్లెట్, ఎగ్ రైస్, ఫ్రైడ్ ఎగ్స్ వంటి వివిధ ఆహార పదార్థాలను తయారు చేయడానికి అవసరమైన వంట సామాగ్రి, గ్యాస్ స్టవ్, పాత్రలు తదితర పరికరాలు కూడా అందిస్తారు.

మహిళలు రద్దీగా ఉండే ప్రధాన రోడ్లు, కూడళ్లు, బస్టాండ్లు, మార్కెట్ ప్రాంతాల్లో ఈ ఎగ్ మార్ట్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక మహిళ ఒంటరిగా ఈ వ్యాపారాన్ని ప్రారంభించి నడిపించుకునే అవకాశం ఉండటం ఈ పథకానికి మరింత ఆకర్షణను తీసుకువస్తోంది. ప్రస్తుతం చాలా మంది ప్రజలు బయట ఆహారం తీసుకోవడానికే ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో, శుభ్రతతో కూడిన మంచి క్వాలిటీ ఫుడ్ అందిస్తే వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
![]()
ఈ పథకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళలు అర్హులు. ముఖ్యంగా డ్వాక్రా లేదా స్వయం సహాయక గ్రూప్ (SHG)లలో సభ్యులైన మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు. అలాగే ఒంటరి మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తారు. వ్యాపారంపై ఆసక్తి ఉండి, ప్రభుత్వం అందించే ఉచిత ట్రైనింగ్‌కు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలి. ఈ ట్రైనింగ్‌లో గుడ్ల అమ్మకం విధానం, మార్ట్ నిర్వహణ, పరిశుభ్రత పాటించే విధానం, ఆహార తయారీ అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారు.

దరఖాస్తు చేయాలనుకునే మహిళలు తమకు దగ్గరలోని మెప్మా కార్యాలయానికి వెళ్లి సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం తీసుకోవాలి. ఇందులో పేరు, మొబైల్ నంబర్, ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు, వ్యాపార ఆసక్తి వంటి 15 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. అధికారుల పరిశీలన అనంతరం నాలుగు నుంచి ఐదు రోజుల్లో అర్హులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఉచిత ట్రైనింగ్ ఇచ్చి, అనంతరం ఎగ్ కార్ట్ మరియు గుడ్ల స్టాక్ అందజేస్తారు.
ఈ వ్యాపారంలో లాభాల విషయానికి వస్తే, ఉదాహరణకు ఎగ్ ఆమ్లెట్ తయారీకి అయ్యే ఖర్చు సుమారు రూ.10 కాగా, దాన్ని రూ.20కు విక్రయించవచ్చు. అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారీకి రూ.30లోపు ఖర్చవుతుండగా, దాన్ని రూ.70 నుంచి రూ.80 వరకు అమ్ముతున్నారు. జాగ్రత్తగా, నాణ్యతతో వ్యాపారం చేస్తే రోజుకు రూ.3,000 వరకు ఆదాయం పొందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మొత్తం మీద ఈ ఉచిత ఎగ్ మార్ట్ స్కీమ్ పేద మహిళల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే శక్తి కలిగిన పథకంగా నిలుస్తోంది.
Also read:

