Aryan Mann: డీయూఎస్‌యూ అధ్యక్షుడిగా ఆర్యన్ మాన్

Aryan Mann

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం (డీయూఎస్‌యూ) ఎన్నికలు ఎప్పుడూ దేశవ్యాప్తంగా ప్రత్యేక శ్రద్ధ ఆకర్షిస్తాయి. ఈసారి కూడా అదే స్థాయి ఉత్కంఠతో, హోరాహోరీ పోటీతో ఎన్నికలు ముగిశాయి. ఇందులో అధ్యక్ష పదవి కోసం జరిగిన పోటీలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) అభ్యర్థి (Aryan Mann) ఆర్యన్ మాన్ ఘన విజయం సాధించాడు. (Aryan Mann) ఆయనకు 24,476 ఓట్లు లభించగా, ప్రత్యర్థి నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్‌యూఐ) అభ్యర్థి జోస్లిన్ నందితా చౌదరి 10,814 ఓట్లకే పరిమితమయ్యారు. దాదాపు 10,000 ఓట్ల ఆధిక్యంతో ఆర్యన్ మాన్ గెలుపొందడం విశేషం.

ఆర్యన్ మాన్ కుటుంబ నేపథ్యం కూడా ఈ ఎన్నికల్లో చర్చనీయాంశమైంది. ఆయన తండ్రి సికందర్ మాన్ పెద్ద లిక్కర్ వ్యాపారి. రాయల్ గ్రీన్ అనే ప్రముఖ లిక్కర్ బ్రాండ్ ఆయన కుటుంబానికి చెందింది. హర్యానాలోని పలు ప్రాంతాల్లో లిక్కర్ షాపులు, తయారీ యూనిట్లు కలిగిన ఈ కుటుంబం వేల కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తోంది. అంతేకాక, బెరీ ప్రాంతంలోని ఏడీఎస్ సంస్థ కూడా వీళ్లదే. ఈ నేపథ్యంలో ఆర్యన్ మాన్ గెలుపు మరింత దృష్టిని ఆకర్షిస్తోంది.

Image

కేవలం వ్యాపార కుటుంబం వారసుడే కాకుండా, ఆర్యన్ మాన్ జాతీయ స్థాయిలో ఫుట్‌బాల్ ప్లేయర్ కూడా. స్పోర్ట్స్ కోటా కింద ఆయన ఢిల్లీ యూనివర్సిటీలో సీటు పొందాడు. క్రీడల్లో సాధించిన విజయాలు, ప్రచారంలో చూపిన హైటెక్ స్ట్రాటజీలు, విద్యార్థుల మద్దతు – ఇవన్నీ కలిసి ఆయన గెలుపుకు దోహదపడ్డాయి.

ఈసారి డీయూఎస్‌యూ ఎన్నికలు కనీవినీ ఎరుగని విధంగా సాగాయి. ఆర్యన్ మాన్ ప్రచార శైలి గతంలో ఎన్నడూ చూడని రీతిలో సాగిందని సోషల్ మీడియాలో అనేక పోస్టులు వైరల్ అయ్యాయి. విదేశీ కార్లతో ర్యాలీలు నిర్వహించడం, అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల స్థాయిలో హైటెక్ ప్రచారం చేయడం ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల చరిత్రలో ఇదే మొదటిసారి. ఇది యువతలో పెద్ద చర్చనీయాంశమైంది.

అధ్యక్షుడిగా ఆర్యన్ మాన్ విజయం సాధించగా, మిగిలిన పదవుల్లో కూడా ఏబీవీపీ ఆధిపత్యం చూపింది. వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్ఎస్‌యూఐ అభ్యర్థి రాహుల్ ఝాన్స్ లా గెలిచినా, కార్యదర్శిగా కునాల్ చౌదరి (ఏబీవీపీ), జాయింట్ సెక్రటరీగా దీపికా ఝా (ఏబీవీపీ) ఎన్నికయ్యారు. నాలుగు కీలక స్థానాల్లో మూడు స్థానాలను ఏబీవీపీ కైవసం చేసుకోవడం ఆ పార్టీకి గట్టి విజయంగా మారింది.

డీయూఎస్‌యూ ఎన్నికల ఫలితాలు వెలువడగానే సోషల్ మీడియాలో ఆర్యన్ మాన్, ఆయన ప్రచార శైలి, గెలుపుపై చర్చలు మిన్నంటుతున్నాయి. విద్యార్థి రాజకీయాల్లో గెలుపు సాధించిన ఈ ఫలితం, భవిష్యత్తులో జాతీయ రాజకీయాలకు దారితీసే మెట్టుగా కొందరు భావిస్తున్నారు.

Also read: