హైదరాబాద్‌లో గణేశ్ నవరాత్రి సందర్భంగా మరోసారి లడ్డూ వేలం సంచలనంగా మారింది. ప్రసిద్ధ (Balapur Ganesha) బాలాపూర్ లడ్డూ రికార్డును బద్దలు కొట్టేలా మైహోం భూజా వద్ద ఏర్పాటు చేసిన (Balapur Ganesha) గణనాథుడి చేతిలోని లడ్డూను ప్రత్యేకంగా వేలం వేశారు. ఈ వేలంపాటు క్రమంగా పోటాపోటీగా సాగి చివరకు రూ.51.77 లక్షలకు చేరుకుంది.
ఈ లడ్డూను కొండపల్లి గణేష్ అనే వ్యక్తి అత్యధిక ధరకు సొంతం చేసుకున్నారు. గతేడాది ఇదే మైహోం భూజా గణపతి లడ్డూ రూ.29.7 లక్షలకు అమ్ముడవ్వగా, ఈసారి రికార్డు స్థాయిలో 51 లక్షలకు పైగా చేరుకోవడం విశేషం.
ఇది కేవలం మైహోం భూజాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే బాలాపూర్ లడ్డూ ప్రతి ఏడాది అత్యధిక ధర పలికే లడ్డూ వేలంపాటగా పేరు గాంచింది. 2024లో బాలాపూర్ లడ్డూ రూ.30.01 లక్షలకు పలికింది. అప్పుడు కొలన్ శంకర్ రెడ్డి లడ్డూను కొనుగోలు చేశారు. అదే సంవత్సరంలో మైహోం భూజాలో లడ్డూ రూ.29.7 లక్షలు పలకడం విశేషం.
అయితే ఈసారి మైహోం భూజాలో లడ్డూ నేరుగా రూ.51 లక్షలకు పైగా పలకడం, వచ్చే రోజుల్లో జరగబోయే బాలాపూర్ లడ్డూ వేలంపాటు ఎంతవరకు రికార్డు బద్దలు కొడుతుందోనన్న ఆసక్తిని పెంచింది.
బాలాపూర్ లడ్డూ చరిత్రపరంగా రాజకీయ, సామాజిక ప్రాధాన్యం కలిగి ఉంది. దానిని కొనే వారు భవిష్యత్‌లో విజయాలను అందుకుంటారని నమ్మకం ఉంది. అందుకే ప్రతీ ఏడాది ఆ లడ్డూ వేలంపాటు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు మైహోం భూజా లడ్డూ అధిక ధర పలికిన నేపథ్యంలో, ఈసారి బాలాపూర్ లడ్డూ ధర ఎంత వరకు పెరుగుతుందో అందరి దృష్టి అక్కడికే నిలిచింది.
హైదరాబాద్ నగరంలో లడ్డూ వేలంపాటలు ఒక రకమైన సాంస్కృతిక వేడుకగా మారాయి. సామాజిక ప్రతిష్ట, ఆధ్యాత్మిక నమ్మకాలు, రాజకీయ ప్రాధాన్యం—ఇవన్నీ కలిసిపోవడంతో ప్రతి ఏడాది లడ్డూ వేలంపాటలు ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నాయి.
Also read:

