భారత (BCCI) మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. ఐసీసీ మహిళల వరల్డ్ కప్ 2025లో దక్షిణాఫ్రికాపై ఘన విజయంతో ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ అద్భుత విజయంతో భారత జట్టుపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక తాజాగా బీసీసీఐ మహిళా ఆటగాళ్లకు తీపికబురు వినిపించింది. (BCCI) వరల్డ్ కప్ గెలిచినందుకు జట్టుకు రూ.51 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది.
ఆదివారం నవి ముంబైలో జరిగిన ఫైనల్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58) అద్భుత ఇన్నింగ్స్ ఆడగా, స్మృతి మంధాన (45), రిచా ఘోష్ (34) కీలక పరుగులు సాధించారు. బ్యాటింగ్‌లో అందరూ చక్కటి సమన్వయంతో రాణించారు.
దీని తరువాత 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ లారా వోల్వార్డ్ ఒంటరిగా పోరాడి 98 బంతుల్లో 101 పరుగులు సాధించినా జట్టును గెలిపించలేకపోయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ దుమ్మురేపి, కేవలం 39 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచింది.
ఈ విజయంతో భారత మహిళల జట్టు వరల్డ్ కప్ చరిత్రలో బంగారు అక్షరాలతో పేరు చెక్కించుకుంది. ఇంతకుముందు ఎన్నో సార్లు ఫైనల్ వరకు చేరినా ట్రోఫీ అందుకోలేకపోయిన టీమిండియా ఈసారి ఆ కలను నిజం చేసింది.
ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా జట్టుకు రూ.51 కోట్ల క్యాష్ రివార్డు ప్రకటించారు. ఇది అధికారిక ప్రైజ్ మనీకి అదనమని తెలిపారు. ఆయన మాట్లాడుతూ, “1983లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత పురుషుల జట్టు వరల్డ్ కప్ గెలిచిన తర్వాత అదే స్థాయిలో ఇప్పుడు మహిళా జట్టు చరిత్ర సృష్టించింది. ఇది భారత మహిళా క్రికెట్‌కు కొత్త శకానికి నాంది పలికింది” అన్నారు.
అలాగే, బీసీసీఐ అధ్యక్షుడు జై షా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి మహిళల క్రికెట్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని సైకియా పేర్కొన్నారు. మహిళా ఆటగాళ్లకు పురుషులతో సమానంగా రెమ్యునరేషన్ అందిస్తున్నామని, ప్రైజ్ మనీని 300 శాతం పెంచామని గుర్తు చేశారు. గతంలో 2.88 మిలియన్ డాలర్లుగా ఉన్న ప్రైజ్ మనీ ఇప్పుడు 14 మిలియన్ డాలర్లకు పెరిగిందని తెలిపారు.
మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు ఇది చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొంటూ, ఈ విజయంతో దేశవ్యాప్తంగా మహిళా ఆటగాళ్లలో కొత్త ఉత్సాహం నింపిందని చెప్పారు. ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్టింగ్ స్టాఫ్ అందరికీ ఈ నగదు బహుమతిని అందజేస్తామని వెల్లడించారు.
Also read:
