కామ్రేడ్ల కంచుకోటగా పేరుగాంచిన కేరళ రాజధాని తిరువనంతపురంలో రాజకీయ చరిత్ర మారింది.ఏళ్ల తరబడి ఎడమపక్షాల ఆధిపత్యంలో ఉన్న నగర పాలక సంస్థపై (BJP) కాషాయ జెండా ఎగిరింది.తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి (BJP) ఘన విజయం సాధించింది.
మొత్తం 101 డివిజన్లకు గాను ఎన్డీఏ అభ్యర్థులు 50 డివిజన్లలో గెలుపొందారు.సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ 29 స్థానాల్లో విజయం సాధించింది.కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్‌కు 19 డివిజన్లు మాత్రమే దక్కాయి.ఇద్దరు స్వతంత్ర సభ్యుల మద్దతుతో ఎన్డీఏ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పడింది.
ఈ ఫలితాలు కేరళ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.దశాబ్దాలుగా కమ్యూనిస్టుల పట్టు ఉన్న తిరువనంతపురంలో ఈ మార్పు గమనార్హం.బీజేపీకి ఇది కేవలం స్థానిక ఎన్నికల విజయం మాత్రమే కాదు.ఇది రాజకీయ దిశ మార్చే ఫలితంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇంకా ఒక సంవత్సరం మాత్రమే మిగిలి ఉంది.వచ్చే ఏడాది కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ తరుణంలో బీజేపీ సాధించిన ఈ విజయం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.45 ఏళ్ల తర్వాత కమ్యూనిస్టు కంచుకోటకు బీటలు పడటం చరిత్రాత్మక ఘట్టంగా మారింది.
ఇన్నేళ్లుగా కేరళలో బీజేపీకి పరిమిత ప్రభావమే ఉండేది.అయితే ఇటీవలి కాలంలో పార్టీ తన వ్యూహాలను మార్చింది.
స్థానిక సమస్యలపై దృష్టి పెట్టింది.అభివృద్ధి, పాలన, మౌలిక వసతుల అంశాలను ముందుకు తీసుకెళ్లింది.దానికి ఫలితమే తిరువనంతపురం కార్పొరేషన్ విజయం అని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఈ విజయం కేరళలో రాజకీయ సమీకరణాలను మార్చే సూచనలు ఇస్తోంది.ఎడమపక్షాలకు ఇది పెద్ద హెచ్చరికగా మారింది.కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూడా ఆలోచనలో పడింది.రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాలు మరింత ఉత్కంఠగా మారే అవకాశం కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.తిరువనంతపురం ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.బీజేపీ కార్యకర్తల కృషిని ప్రశంసించారు.
‘‘తిరువనంతపురం ధన్యవాదాలు’’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.తిరువనంతపురం కార్పొరేషన్‌లో బీజేపీ-ఎన్డీఏకు లభించిన ఆధిక్యతను కీలక మలుపుగా అభివర్ణించారు.కేరళ అభివృద్ధి ఆకాంక్షలను బీజేపీ మాత్రమే నెరవేర్చగలదని ప్రజలు నమ్ముతున్నారని పేర్కొన్నారు.
ఈ శక్తివంతమైన నగరాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని మోదీ స్పష్టం చేశారు.ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు.ఈ విజయానికి కారణమైన బీజేపీ కార్యకర్తలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అట్టడుగు స్థాయి నుంచి పనిచేసిన తరతరాల కార్యకర్తల పోరాటానికి ఇది గుర్తింపు అని మోదీ పేర్కొన్నారు.
కేరళ రాజకీయాల్లో ఇది ఒక కొత్త అధ్యాయానికి నాంది అని వ్యాఖ్యానించారు.మొత్తంగా తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి.కామ్రేడ్ల కంచుకోటపై కాషాయ జెండా ఎగిరిన ఈ ఘట్టం చరిత్రలో నిలిచిపోనుంది.
Also read:

