గత ప్రభుత్వం హయాంలో విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విచారణను సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే కమిషన్(Commission) చైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డిని మార్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొత్త చైర్మన్ గా ఎవరిని నియమిస్తారనేది మధ్యాహ్నం తర్వాత చెప్పాలని సూచించింది. ఇవాళ సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేసీఆర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. జ్యుడీషియరీ కమిషన్ నియామకం చట్ట ప్రకారం జరగలేదన్నారు. దీనిపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. పిటిషన్ ను పూర్తిగా విచారణ చేయకముందే హైకోర్టు కొట్టేసిందని, తాము రిప్లయ్ ఇవ్వకుండానే పిటిషన్ ను డిస్మిస్ చేసిందని చెప్పారు. కమిషన్ చైర్మన్ నర్సింహారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఎంక్వైరీ పూర్తి కాకముందే ప్రెస్ మీట్లు పెట్టి కేసీఆర్ తప్పు చేశారని చెబుతున్నారని ధర్మాసనానికి తెలిపారు. దీనిపై స్పందించిన బెంచ్ ‘ప్రెస్ మీట్ లో జస్టిస్ నరసింహారెడ్డి తన సొంత ఒపినియన్ చెప్పినట్లు అనిపిస్తుంది’ అని అభిప్రాయపడింది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది విభేదించారు. ప్రెస్ మీట్ లో కేవలం ఎంక్వైరీ స్టేటస్ మాత్రమే చెప్పారని కోర్టుకు తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడ్డ నేపథ్యంలో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఛత్తీస్ గఢ్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుందని, 3 రూపాయల 90 పైసలకు యూనిట్ చొప్పున పవర్ కొన్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి వివరించారు. ‘ఓపెన్ బిడ్డింగ్ వేయకుండా… నెగోషియేషన్ ప్రకారం ఎందుకు పవర్ కొన్నారని’బెంచ్ ప్రశ్నించింది. దీనిపై కేసీఆర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అత్యవసర సమయంలో టెండర్లు వేయకుండా విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుందన్నారు. ఇదే అంశంపై కేసీఆర్ తో పాటు ఇతర విద్యుత్ అధికారులకు నోటీసిలు ఇచ్చామని ప్రభుత్వం తరఫు న్యాయవాది సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు. దేశవ్యాప్తంగా పవర్ ప్రాజెక్టులు అన్ని సూపర్ క్రిటికల్ టెక్నాలజీ తో నిర్మిస్తుంటే… భద్రాద్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీ తో నిర్మించారని, దీంతో ప్రభుత్వ ఖజానా కి వ్యయం పెరిగిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనానికి విన్నవించారు. ఇరు వర్గాల వాదనలు నమోదు చేసుకున్న సీజేఐ బెంచ్.. పవర్ కమిషన్(Commission) చైర్మన్ నర్సింహారెడ్డిని తప్పించి మరొకరిని నియమించాలని సూచించింది.
ALSO READ :

