తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్యను మరింత బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి (CM Revanth Reddy) రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 34 ప్రభుత్వ వైద్య కళాశాలలు పూర్తి స్థాయి వసతులతో పని చేయాలంటూ సంబంధిత అధికారులను (CM Revanth Reddy) ఆదేశించారు. దీనికి అనుగుణంగా తక్షణమే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు.
ఈ మేరకు ఇవాళ హైదరాబాద్లోని ఐసీసీసీ సమావేశ మందిరంలో వైద్యారోగ్య శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో ఎదురవుతున్న సమస్యలు, వసతుల కొరతలు, జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) సూచనలు మొదలైన అంశాలపై లోతుగా చర్చ జరిగింది.
సీఎం సూచనల ప్రకారం, ప్రతి వైద్య కళాశాల స్థాయిలో అవసరాలపై సమగ్ర అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీ ప్రదేశానికి వెళ్లి అక్కడ అవసరమైన వసతులు, నిధులు, మౌలిక సదుపాయాల వివరాలతో కూడిన నివేదికను తక్షణమే అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉన్న హాస్పిటళ్లలో పడకల పెంపు, వైద్య పరికరాల లభ్యత, ఖాళీల భర్తీ, బోధన సిబ్బందికి ప్రమోషన్లు వంటి అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు. ప్రభుత్వం విడుదల చేయాల్సిన నిధులను వెంటనే మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి రావాల్సిన నిధులు, అనుమతులపై త్వరిత చర్యలు తీసుకుంటామని, అవసరమైతే కేంద్ర మంత్రి నడ్డా మరియు సంబంధిత అధికారులను కలుసుకుని సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.
ఇంకా నర్సింగ్ కళాశాలల విషయంలో, జపనీస్ భాషను ఆప్షనల్ సబ్జెక్టుగా బోధించాలనే ప్రతిపాదనను సీఎం ముందుపెట్టారు. జపాన్లో భారతీయ నర్సులకు అధిక డిమాండ్ ఉందని పేర్కొన్నారు. ఇది ఉపాధికి నూతన అవకాశాలను తెరుస్తుందని అభిప్రాయపడ్డారు.
ఆస్పత్రులకు వచ్చే రోగులకు ఎలాంటి సేవలు అందిస్తున్నామన్నదానిపై సమయానికి సమగ్రమైన సమాచారం అందించేందుకు వైద్యుల కోసం ప్రత్యేక యాప్ అభివృద్ధిపై అధ్యయనం ప్రారంభించాలన్నారు. విద్యా, వైద్య రంగాలు ఎంతగానో ప్రజల జీవితాల్లో ప్రభావం చూపే రంగాలని పేర్కొన్న సీఎం, ప్రతి నెల మూడో వారంలో ఈ రెండు శాఖలపై సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమీక్షలో మంత్రి దామోదర రాజనర్సింహ, సీఎస్ రామకృష్ణారావు, సీఎం ప్రధాన కార్యదర్శి వీ శేషాద్రి, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టియానా జెడ్ చోంగ్తూ తదితరులు పాల్గొన్నారు.
Also read:

