Factory blast: ఒక్కో కుటుంబానికి రూ. కోటి పరిహారం

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో నిన్న జరిగిన ఘోర పేలుడు(Factory blast) ప్రమాదం రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ ప్రమాదంలో సుమారు 36 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందింది. ఈ విషాద ఘటన జరిగిన చోటుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ స్వయంగా వెళ్లి పరిశీలించారు. మృతుల కుటుంబాలను పరామర్శించిన సీఎం, ప్రభుత్వ చర్యలపై మీడియాతో మాట్లాడారు.

ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, “ఒక్కో మృతుడి కుటుంబానికి రూ. 1 కోటి చొప్పున పరిహారం అందజేస్తాం. ఈ పరిహారాన్ని పరిశ్రమ యాజమాన్యంతో పాటు ప్రభుత్వం కలసి అందిస్తుంది” అని ప్రకటించారు. ఈ ప్రకటనతో బాధిత కుటుంబాలకు కొంత ఊరట లభించినట్టు కనిపిస్తోంది.(Factory blast)

అంతేగాక, ఈ పేలుడులో తీవ్రంగా గాయపడిన వారికి రూ. 10 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 5 లక్షల పరిహారం అందిస్తామని సీఎం వివరించారు. గాయపడినవారి వైద్యం ఖర్చులను పరిశ్రమ యాజమాన్యంతో కలిసి ప్రభుత్వం భరించనున్నదని తెలిపారు.

ఈ ప్రమాదంలో చనిపోయిన వారు బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారని సీఎం పేర్కొన్నారు. వారి మృతదేహాలను వారి స్వస్థలాలకు ప్రభుత్వం తరలించనుందని, అందుకు అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు. చనిపోయిన వారి పిల్లలకు తెలంగాణ ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో ప్రవేశం కల్పించనున్నట్టు ప్రకటించారు.

ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని, మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనర్సింహా ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని సీఎం వివరించారు. అయితే, ఇంతటి ఘోర ఘటన జరిగి 24 గంటలు కావస్తున్నా పరిశ్రమ యాజమాన్యం స్పందించకపోవడం విచారకరం అని పేర్కొన్నారు.

ఈ ప్రమాదంపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోనుందని సీఎం స్పష్టం చేశారు. ఈ ఘటనతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఉద్వేగానికి గురవుతున్నారు. పరిశ్రమల భద్రతపై మరోసారి చర్చ తలెత్తిన సంగతి తెలిసిందే.

Also Read :