Kamareddy : సెప్టెంబర్ 15న కామారెడ్డిలో కాంగ్రెస్ భారీ సభ

Congress meeting Kamareddy, Kamareddy public meeting

కాంగ్రెస్ పార్టీ ఈ నెల 15న కామారెడ్డిలో భారీ బహిరంగ సభకు సిద్ధమవుతోంది. 2023 నవంబరులో కూడా కామారెడ్డిలోనే (Kamareddy) బీసీ డిక్లరేషన్ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సభలో అప్పటి టీపీసీసీ చీఫ్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచుతామని స్పష్టమైన హామీ ఇచ్చారు.

ఆ హామీని అమలు చేస్తూ, అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టింది. బీసీ జనాభా లెక్కలు స్పష్టంగా తేల్చిన తర్వాత విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ బిల్లును గవర్నర్‌కు పంపి, అక్కడి నుంచి కేంద్రానికి కూడా చేరవేసింది. అంతేకాకుండా, పంచాయతీరాజ్ చట్టం 2018లో మార్పులు చేస్తూ రిజర్వేషన్లలో 50% లిమిట్ ఎత్తివేసేలా ఆర్డినెన్స్ జారీ చేసింది.అయితే ఈ రెండు కీలక నిర్ణయాలపై కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నేతలు భారీ ధర్నా నిర్వహించారు. బిల్లుకు ఆమోదం తెలపాలని రాష్ట్రపతిని కలిసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నించారు. తాజాగా మరోసారి అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇంతవరకు కేంద్రం స్పందించకపోవడంతో, రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు జీవో ఇచ్చి వెళ్లాలనే ఆలోచనలో ఉంది. ఈ ప్రక్రియలో ఎటువంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే కామారెడ్డిలో(Kamareddy) జరగబోయే కాంగ్రెస్ సభ ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం తాము బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధితోనే ఉన్నామని ప్రజలకు మరొకసారి నమ్మబలికే ప్రయత్నం చేస్తోంది.

అంతేకాకుండా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేశ్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా పార్టీ విజయాలు, ప్రభుత్వ చర్యలను ప్రజలకు వివరించేందుకు కామారెడ్డినే (Kamareddy) వేదికగా ఎంచుకుంది.ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి సహా పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు, కీలక కాంగ్రెస్ నేతలు పాల్గొనే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కట్టుబాటు, రాష్ట్రంలో తీసుకుంటున్న సంక్షేమ నిర్ణయాలను ప్రజల ముందు ఉంచడమే సభ ప్రధాన ఉద్దేశం.

also read :

HyderabadGanesh: రేపే హైదరాబాద్‌లో గణేశ్ మహా నిమజ్జనం

Afghanistan: వందలాది ప్రాణనష్టం, వేల ఇళ్లు ధ్వంసం