రాచకొండ (Rachakonda) పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 2025లో గణనీయంగా పెరిగింది. ఈ విషయాన్ని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు వార్షిక నివేదిక ద్వారా వెల్లడించారు. 2025 సంవత్సరంలో మొత్తం 33,040 కేసులు నమోదు కాగా, గత ఏడాది ఈ సంఖ్య 28,626గా ఉండటం గమనార్హం. అంటే ఏడాదిలోనే వేల సంఖ్యలో కేసులు పెరగడం ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది.ఈ ఏడాది నమోదైన కేసుల్లో ఆస్తి నేరాలు, మహిళలపై నేరాలు, కిడ్నాప్, ఫోక్సో కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. (Rachakonda) రాచకొండ పరిధిలో 3 దోపిడీ కేసులు, 67 దొంగతనాలు చోటుచేసుకున్నాయి. ఇండ్లలో చోరీలు 589గా నమోదుకాగా, వాహనాల చోరీలు 876గా ఉన్నాయి. సాధారణ చోరీ కేసులు 1,161 వరకు నమోదవడం నేరాల తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది.
హింసాత్మక నేరాల విషయానికి వస్తే ఈ ఏడాది మొత్తం 73 హత్యలు చోటుచేసుకున్నాయి. మహిళలపై నేరాలు కూడా ఆందోళన కలిగించే స్థాయిలో ఉన్నాయి. 330 అత్యాచార కేసులు, 12 వరకట్న చావులు, 782 గృహహింస కేసులు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే మహిళలపై నేరాలు 4 శాతం పెరిగినట్లు రాచకొండ సీపీ తెలిపారు. ఈ గణాంకాలు మహిళల భద్రతపై మరింత కఠిన చర్యలు అవసరమని సూచిస్తున్నాయి.అలాగే చిన్నారుల భద్రతకు సంబంధించి కూడా ఆందోళనకర పరిస్థితి నెలకొంది. 2025లో మొత్తం 579 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. ఫోక్సో చట్టం కింద 1,224 కేసులు నమోదు కావడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. అదనంగా 3 ‘మర్డర్ ఫర్ గెయిన్’ కేసులు కూడా ఈ ఏడాది నమోదైనట్లు నివేదిక వెల్లడించింది.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డ్రగ్స్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా రాచకొండ పోలీసులు పెద్దఎత్తున మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.20 కోట్ల విలువైన డ్రగ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుల్లో 668 మంది నిందితులను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న మత్తు పదార్థాల్లో 2,090 కిలోల గంజాయి, 35 కిలోల గంజాయి చాక్లెట్లు, 34 కిలోల హ్యాష్ ఆయిల్‌తో పాటు ఎండీఎంఏ, ఓపీఎస్, హెరాయిన్ వంటి ఇతర మత్తు పదార్థాలు ఉన్నాయి. డ్రగ్స్‌కు సంబంధించి ఈ ఏడాది మొత్తం 256 కేసులు నమోదు చేసినట్లు సీపీ వెల్లడించారు.నేరాలు పెరిగినా, పోలీసుల పనితీరులో మెరుగుదల కనిపిస్తోందని సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ఈ ఏడాది 5,647 కేసుల్లో 146 మందికి జైలు శిక్ష ఖరారైందని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే కన్విక్షన్ రేటు 74 శాతం పెరిగినట్లు వెల్లడించారు. ఇది నిందితులకు శిక్షలు ఖరారయ్యే విషయంలో పోలీసుల సమర్థతను సూచిస్తోంది.
సైబర్ నేరాల విషయంలో మాత్రం కొంత ఉపశమనం లభించింది. గత ఏడాది 4,618 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 3,734కి తగ్గినట్లు సీపీ తెలిపారు. అవగాహన కార్యక్రమాలు, వేగవంతమైన చర్యల వల్లే ఈ తగ్గుదల సాధ్యమైందని అధికారులు భావిస్తున్నారు.అలాగే ‘ఆపరేషన్ ముస్కాన్’ కింద 2,479 మంది, ‘ఆపరేషన్ స్మైల్’ కింద 1,071 మందిని పోలీసులు రక్షించినట్లు తెలిపారు. మొత్తం మీద నేరాల సంఖ్య పెరిగినా, వాటిని నియంత్రించేందుకు, బాధితులకు న్యాయం అందించేందుకు రాచకొండ పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని సీపీ సుధీర్‌బాబు పేర్కొన్నారు.
Also read;

