- టీఎస్ పీఎస్సీ వద్ద రచ్చ
- ఆఫీసులోకి దూసుకెళ్లిన బీజేవైఎం
- ఎన్ఎస్ యూఐ, బీఎస్పీ, టీజేఎస్ ధర్నా
- ఆర్టీసీ క్రాస్ రోడ్డులో బైఠాయించిన నిరుద్యోగులు
టీఎస్ పీఎస్సీ(TSPSC) ఆఫీసు రణరంగాన్ని తలపించింది. పేపర్ లీక్ ను నిరసిస్తూ భారీ సంఖ్యలో బీజేవైఎం కార్యకర్తలు ఆపీసు వద్ద ధర్నాకు దిగారు. టీఎస్ పీఎస్సీ (TSPSC)గేట్లు మూసి ఉండటంతో పైకి ఎక్కి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పలువురు ఆందోళన కారులు కమిషన్ ఆఫీసు బోర్డును పీకేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలుచేశారు. అంతకు ముందు ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు కమిషన్ గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణ విద్యార్థి జన సమితి కార్యకర్తలు తరలివచ్చి టీఎస్ పీఎస్సీ (TSPSC) ఆఫీసు ముందు ధర్నా నిర్వహించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా ప్రతిఘటించారు. మరో వైపు నుంచి బీఎస్పీ కార్యకర్తలుసైతం తరలి రావడంతో నాంపల్లిలోని టీఎస్ పీఎస్సీ ఆఫీసు పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదిలా ఉండగా చిక్కడపల్లి లైబ్రరీలో చదువుతూ ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు భారీ సంఖ్యలో బయటికి వచ్చిన ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పేపర్ లీక్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, చిన్న స్థాయి ఉద్యోగులను సస్పెండ్ చేస్తే చాలదన్నారు. కమిషన్ చైర్మన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. గతంలో జరిగిన పరీక్షల విషయంలోనూ అనేక అనుమానాలున్నాయన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గ్రూప్ 1 పేపర్ లీక్?
అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) రిక్రూట్ మెంట్ పరీక్ష క్వశ్చన్ పేపర్ లీక్ నేపథ్యంలో అందరి దృష్టీ గ్రూప్1 ప్రిలిమినరీ ఎగ్జామ్ పై పడింది. ఈ ఘటనలో కీలక నిందితుడిగా ఉన్న పులిదిండి ప్రవీణ్ కుమార్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాశాడు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. అతనికి ఏకంగా 103 మార్కులు వచ్చాయని సోషల్ మీడియాలో ఓఎంఆర్ షీటు చక్కర్లు కొడుతోంది. ఇది ప్రవీణ్ దా..? కాదా అనే విషయంలో టీఎస్పీఎస్సీ అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. మరోపక్క ఓఎంఆర్ షీట్ పై బుక్ లెట్ నంబర్ తప్పుగా వేసి, బబ్లింగ్ చేయడంతో అతన్ని డిస్ క్వాలిఫై చేశామని కమిషన్ అధికారులు చెప్తున్నారు.
టీఎస్పీఎస్సీలో కారుణ్య నియామకం ద్వారా జూనియర్ అసిస్టెంట్ గా జాయిన్ అయిన ప్రవీణ్ కుమార్.. ప్రస్తుతం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ హోదాలో కొనసాగుతున్నారు. కమిషన్ సెక్రెటరీ పీఏగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే అక్టోబర్ లో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రవీణ్ రాశాడు. ఆ పరీక్షలో అతనికి 103 మార్కులు వచ్చినా.. రాంగ్ బబ్లింగ్ తో డిస్ క్వాలిఫై అయ్యాడు. ఈ విషయాన్ని టీఎస్పీఎస్సీ ఉద్యోగులతో పాటు, సెక్రెటరీని కలిసేందుకు వచ్చిన గ్రూప్ 1అభ్యర్థులకూ పలుమార్లు చెప్పినట్టు వారు పేర్కొంటున్నారు.
గ్రూప్ 1లో ఇంటర్వ్యూ విధానం ఎత్తేయడంతో ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపరర్ చాలా కఠినంగా ఇచ్చారు. చాలావరకూ లాజికల్ క్వశ్చన్లు ఇచ్చారు. సివిల్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మాత్రమే 80 మార్కులు దాటే అవకాశం ఉండగా, ప్రవీణ్ కు ఏకంగా 103 మార్కులు ఎలా వచ్చాయనే అంశం హాట్ టాపిక్ గా మారింది. దానిపై అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది కూడా ఎలాంటి కోచింగ్ కోచింగ్ లేకుండా, ఆఫీసుకు సెలవు పెట్టకుండా ఎలా సాధ్యమైందనేది చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలు చూస్తుంటే, పక్కాగా ప్రిలిమ్స్ పేపర్ కూడా లీక్ చేసి ఉంటాడని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.
ఆ పేపర్ అతనుకొక్కడే చూశాడా? లేక ఎవరికైనా ఏఈ పేపర్ మాదిరి అమ్ముకున్నాడా? అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. దీనిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. వందకు పైగా మార్కులు వచ్చిన అభ్యర్థులపై సమగ్ర విచారణ చేయించాలనే డిమాండ్ అభ్యర్థులు వస్తోంది.
Also Read:

