తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన (surrogacy scam) సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు పోలీసులు విచారణ జరుపుతుండగా, ఇప్పుడు ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సైతం రంగంలోకి దిగింది. ఇప్పటికే నమోదైన (surrogacy scam) ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి, ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను త్వరలోనే విచారించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కేసు మొదటి నుండి వివాదాస్పదంగానే సాగుతోంది. సరోగసీ పేరుతో పిల్లల అక్రమ రవాణా (ట్రాఫికింగ్) జరిగిందన్న ఆరోపణలతో డాక్టర్ నమ్రతపై తీవ్రమైన ఆరోపణలు మోపబడ్డాయి. ఇంతకుముందు పోలీసులు నమ్రతతో పాటు ఆమెకు సన్నిహితంగా ఉన్న పలువురిని విచారించారు. ఇటీవల ఆమెతో కలిసి 1988లో ఆంధ్ర మెడికల్ కాలేజీలో చదివిన ముగ్గురు వైద్యులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
డాక్టర్ నమ్రత జీవితం, వృత్తి కూడా ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జన్మించిన ఆమె, విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, అనంతరం జేజేఎం మెడికల్ కాలేజీలో ఎండీ గైనకాలజీ పూర్తి చేశారు. విజయవాడలో తన వైద్య వృత్తిని ప్రారంభించి, తర్వాత ఫెర్టిలిటీ సెంటర్‌ను స్థాపించారు. అనంతరం హైదరాబాద్, సికింద్రాబాద్, విశాఖపట్నంలో కొత్త ఫెర్టిలిటీ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు.
అయితే, పోలీసుల దర్యాప్తులో బయటపడిన వివరాలు షాకింగ్‌గా మారాయి. ఏజెంట్ల సాయంతో పేద మహిళలను లక్ష్యంగా చేసుకుని, వారికి డబ్బు ఆశ చూపి గర్భాలను కొనసాగించేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ గర్భాలను సరోగసీ పేరుతో సంతానం లేని దంపతులకు “కానూను అనుమతించే పద్ధతి” అన్నట్లు చూపించి, ఒక్కో కేసులో 50 లక్షల వరకు వసూలు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు.
ఈ అక్రమ రాకెట్ ద్వారా డాక్టర్ నమ్రత దాదాపు ₹500 కోట్లకు పైగా సంపాదించినట్లు విచారణలో బయటపడింది. దీంతో ఆర్థిక లావాదేవీలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఈడీ దర్యాప్తులోకి దిగడంతో బ్యాంకు లావాదేవీలు, నగదు జమ వివరాలు, ఎప్పుడు, ఎవరి నుండి ఎలాంటి మార్గంలో డబ్బు వచ్చిందనే అంశాలను ఆరా తీస్తోంది.
ఈ పరిణామంతో కేసు మరింత వేడెక్కింది. ఒకవైపు పోలీసులు నేరపరమైన అంశాలపై దర్యాప్తు కొనసాగిస్తుండగా, మరోవైపు ఈడీ ఆర్థిక అక్రమాలపై దృష్టి సారించడం కేసు ప్రాధాన్యాన్ని పెంచింది.
చట్టపరంగా సరోగసీకి స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, వాటిని విస్మరించి ఇలాంటి అక్రమాలు కొనసాగించడంపై వైద్య రంగం, ప్రజాసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. “ఇది కేవలం ఒక వైద్య అక్రమం కాదు, మానవత్వాన్ని సైతం మసకబార్చే నేరం” అని సామాజిక కార్యకర్తలు విమర్శిస్తున్నారు.
ఇకపై ఈ కేసులో మరెవరి పేర్లు బయటపడతాయా? ఈడీ దర్యాప్తు ఏ మలుపు తిప్పుతుంది? అనే అంశాలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.
Also read: