గద్వాల జిల్లాలోని ఈడిగోనిపల్లి (Edigonipalli) గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఊహించని మలుపులు చోటుచేసుకుంటూ ఆసక్తికర రాజకీయ నాటకం ఆవిష్కృతమైంది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక ఎన్నికలు పోటీతో సాగుతాయి. అయితే (Edigonipalli) ఈడిగోనిపల్లిలో సర్పంచ్ పదవి కోసం జరిగిన పోటీ మాత్రం గ్రామస్థులే నిర్ణయించిన ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా సాగింది. బీసీ మహిళలకు సర్పంచ్ సీటు రిజర్వ్ కావడంతో, గ్రామాభివృద్ధి కోసం నిధులు సమకూర్చాలన్న సంకల్పంతో గ్రామస్తులు గత వారం ప్రత్యేకంగా వేలం పాట నిర్వహించారు.
వేలం పాటలో సరస్వతి గెలుపు
వేలంలో గ్రామానికి చెందిన సరస్వతి భారీగా రూ.9.80 లక్షలు పాడి సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు. ఆమె పాడిన మొత్తాన్ని గ్రామానికే అందజేయడం గ్రామస్తుల్లో ఆనందాన్ని పెంచింది. గ్రామ ప్రజలు ఆమెకు ఘన స్వాగతం పలికి సన్మానాలు నిర్వహించారు. అభివృద్ధి కోసం ముందుకు వచ్చిందనే కారణంగా సరస్వతి ఎంపికపై అందరూ సంతోషం వ్యక్తం చేశారు.
ఉపసర్పంచ్ ఎంపికలో చిక్కులు
ఇక్కడివరకూ అన్నీ సజావుగానే సాగుతున్నట్లు కనిపించినా, ఉపసర్పంచ్ ఎంపిక సమయంలో గ్రామ రాజకీయాల్లో విభేదాలు బయల్పడ్డాయి. సరస్వతి ప్యానల్ నుంచి ఉపసర్పంచ్‌కు ఎవరు నామినేషన్ దాఖలు చేయాలి అన్న విషయంపై విభేధాలు తలెత్తాయి. ప్యానల్ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో నామినేషన్ ప్రక్రియ సందిగ్ధంలో పడింది.నామినేషన్ దాఖలు చేయడానికి మరుసటి రోజే తుది గడువు కావడంతో, సరస్వతి పక్షం నుంచి ఎవరూ నామినేషన్ దాఖలు చేయని పరిస్థితి ఏర్పడింది. ప్యానల్లో గందరగోళం కొనసాగుతుండగానే ఈ పరిస్థితిని గమనించిన గ్రామానికి చెందిన రాణి ముందుకొచ్చి సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు.
సింగిల్ నామినేషన్‌తో రాణి ఏకగ్రీవ ఎన్నిక
తుది గడువు ముగిసే సమయానికి రాణి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో, ఎలాంటి పోటీ లేకుండా ఆమెను అధికారికంగా ఏకగ్రీవ సర్పంచ్‌గా అధికారులు ప్రకటించారు. వెంటనే ధ్రువీకరణ పత్రం అందజేయడంతో రాణి అధికారికంగా ఈడిగోనిపల్లి సర్పంచ్ అయ్యారు. గ్రామ రాజకీయాల్లో ఇది పెద్ద చర్చనీయాంశమైంది.
వేలంలో గెలిచింది సరస్వతి… కుర్చీ ఎక్కింది రాణి
ఈడిగోనిపల్లిలో చోటుచేసుకున్న ఈ సంఘటనపై గ్రామంలో, అలాగే సోషల్ మీడియాలో చర్చలు రేగుతున్నాయి. అభివృద్ధి కోసం వేలం పాట ద్వారా సర్పంచ్ పదవి దక్కించుకున్న సరస్వతి చివరకు అసలు పదవి కోల్పోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గ్రామస్తుల్లో కొందరు ఉపసర్పంచ్ ఎంపికలో జరిగిన విభేదాలే ఈ పరిణామానికి కారణమని చెప్పుకుంటుండగా, మరికొందరు ఈ ఘటనను పరిపాలనా లోపంగా అభివర్ణిస్తున్నారు.
ఎలాగైనా, పాట నీది… కుర్చీ నాది అన్నట్లు, సరస్వతి పెట్టిన రూ.9.80 లక్షల వేలం పాట చివరికి రాణి గెలుపుకు దారి తీసింది. గ్రామస్థుల సమిష్టి నిర్ణయంతో ప్రారంభమైన ఈ ప్రక్రియ చివరకు ఊహించని విధంగా ముగియడం ఈ ఎన్నికను ప్రత్యేకంగా నిలబెడుతోంది.
Also read:
