ప్రధాని మోదీ అబద్ధాలే చెబుతున్నారన్న సీపీఐ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ(Narayana) మరోసారి కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ – ప్రపంచంలో అబద్ధాన్ని అనర్గళంగా మాట్లాడేవారిలో ప్రధాని మోదీ, మాజీ సీఎం కేసీఆర్ ముందున్నారని వ్యాఖ్యానించారు.
జమ్ము కశ్మీర్‌లో అమర్నాథ్ యాత్ర జరుగుతున్న సమయంలో ఏడున్నర లక్షల మంది భద్రతా బలగాలు మోహరించబడినా ఉగ్రదాడి ఎలా సాధ్యమయ్యిందని ఆయన ప్రశ్నించారు. ఇటీవలి పెహల్గాం ఘటన తర్వాత మృతుల దేహాలు తమ ఇంటికి చేరకముందే ప్రధాని మోదీ బీహార్ పర్యటనకు వెళ్లిన తీరు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
ఉగ్రదాడిపై అనుమానాలు:
“పార్లమెంట్‌లో ఆపరేషన్ సింధూర్‌పై చర్చ జరుగుతున్న సమయంలోనే ఉగ్రవాదులను కాల్చి చంపారు. అదే పనిచేయడం ముందే ఎందుకు సాధ్యపడలేదు? ఆ ఉగ్రవాదులను ముందే పట్టుకుని స్క్రిప్ట్ ప్రకారం నిన్నే చంపారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి” అని ఆయన విమర్శించారు.(Narayana)
ద్వంద్వ ధోరణి ఉందంటూ విమర్శ:
విమాన ప్రమాదాల్లో మృతులకు రూ. కోటి పరిహారం అందిస్తున్న ప్రభుత్వం… సరిహద్దుల్లో పోరాడి వీరమరణం పొందిన జవాన్లకు మాత్రం కేవలం లక్ష రూపాయల పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటోందని ఆయన మండిపడ్డారు.

