Malla Reddy : మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ని, ఆయన అల్లుడు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిని పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇవాళ ఉదయం సుచిత్ర సర్కిల్ పరిధిలోని సర్వే నంబర్ 82లో కొందరు వ్యక్తులు వేసిన ఫెన్సింగ్, బారీకెడ్లను మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి అనుచరులతో వచ్చి తొలగించారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడికి వచ్చిన పోలీసులతో మాజీ మంత్రి మల్లారెడ్డి వాగ్వాదానికి దిగారు. తాము 30 ఏండ్ల కింద రెండున్నర ఎకరాల జాగాను ఓ ఫ్యాక్టరీ వద్ద నుంచి కొనుగోలు చేశామని, ఇందుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నాయని మల్లారెడ్డి(Malla Reddy) తెలిపారు. వంద మంది గూండాలను తమ మీదకు పంపారని, రాత్రి నుంచి హంగామా చేస్తున్నారని, తాము ఆటో షెడ్డు కు అద్దెకు ఇస్తే వాళ్లను వెళ్లగొట్టారని, కాంపౌండ్ వాల్ ధ్వంసం చేసి కొత్తగా బ్యారికేడ్లు ఏర్పాటు చేసుకున్నారని మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. బీర్లు తాగుతూ, బిర్యానీలు తింటూ హంగామా సృష్టిస్తున్నారని తెలిపారు. ఇవన్నీ సీసీ కెమరాల్లో రికార్డయ్యాయని చెప్తున్నారు. ఇద్దరం ఎమ్మెల్యేలం వచ్చినా పోలీసులు పట్టించుకోవడం లేదని మల్లారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంత దౌర్జన్యమా..? అని ప్రశ్నించారు. తమ పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని అన్నారు.

15 మందిమి 1.06 ఎకరాలు కొన్నం
బాధితుల ఆవేదన
సర్వే నంబర్ 82లో తాము 15 మందిమి కలిసి 1.06 ఎకరాల జాగా కొనుగోలు చేశామని, ఇదే సర్వే నంబర్ లో మల్లారెడ్డి(Malla Reddy)కి కూడా రెండున్నర ఎకరాల జాగా ఉందని బాధితులు చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తమను ఈ జాగాలోకి రానీయలేదని అన్నారు. ఇప్పుడు మా స్థలంలోకి మేం వస్తే మల్లారెడ్డి గూండాలను పట్టుకొని వచ్చి తమపై దాడి చేశారని తెలిపారు. తాము వేసుకున్న షెడ్లను కూలగొట్టి శ్రీనివాస్ రెడ్డి, సుధామ అనే వాళ్లను కొట్టారని అన్నారు. తమకు 2016లోనే కోర్టు ఆర్డర్ ఇచ్చిందని, అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నదని, మల్లారెడ్డి మంత్రిగా ఉన్నారని దాంతో ఎంటర్ కాలేకపోయామని తెలిపారు. ఇప్పుడు కోర్టు ఆర్డర్ కాపీతో వస్తే తమపై దౌర్జన్యానికి దిగుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

కేసు పెడితే పెట్టుకోండి.. జాగా వదులుకోం
= ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి
ఘటనా స్థలానికి వచ్చిన మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఆయన అనుచరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రెండెకరాల చిల్లర జాగా ఉంది.. మాకు పర్మిషన్స్ ఉన్నాయ. టాక్స్ లు కడుతున్నం.. ఆ టోల వాళ్లకు మేమే కిరాయికి ఇచ్చినం.. గడ్డపారలు, కొడవండ్లు తీసుకొని మా మీదకు వచ్చిండ్రు. శ్రీనివాస్ రెడ్డి అనేటైన మా మీదకు వచ్చిండు.. రాత్రికి రాత్రి వచ్చిన మావోళ్ల సెల్ ఫోన్లు గుంజుకొని ఆగం జేసిండ్రు.. సీఐ, డీసీపీ, ఏసీపీకి మాట్లాడిన.. శ్రీనివాస్ రెడ్డిని అరెస్టు చేయాలె.. మా డాక్యుమెంట్ చూపిస్తం..’ అని మాజీ మంత్రి మల్లారెడ్డి (Malla Reddy)తెలిపారు. ‘మేం డైరెక్ట్ వచ్చి కంప్లయింట్ చేస్తే.. వాళ్లు రెస్పాండ్ కావట్లేదు.. ట్రెస్ పాస్ చేసిన వారి మీద కేసు పెట్టడం లేదు.. మమ్మల్ని పరేషాన్ చేస్తున్నారు.. 30 ఏండ్ల కింద కొన్నం ఇది ఫ్యాక్టరీ ల్యాండ్’ అని మల్కాజ్ గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అన్నారు.

 

Also read :

Vinod Kumar : ప్రధానిలో ఫ్రస్ట్రేషన్ పెరిగింది

Hyderabad : సిటీలో వాన