Huzurabad : లోక్ సభ ఎన్నికలు పూర్తి కాగానే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల రద్దుపై మోదీ సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇవాళ కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని హుజూరాబాద్(Huzurabad) లో జరిగిన జనజాతర సభలో సీఎం మాట్లాడారు.. పొంచి ఉన్న ప్రమాదాన్నినిరుద్యోగులు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. తాను రిజర్వేషన్ల రద్దు అంశాన్ని ప్రస్తావించగానే గాంధీభవన్ కు ఢిల్లీ పోలీసులను పంపారని, వాటికి భయపడేది లేదన్నారు. గత సీఎం కేసీఆర్ కూడా తనపై ఏసీబీ, విజిలెన్స్, పోలీసు కేసులు పెట్టించి జైల్లో వేసిన బెదరలేదని గుర్తు చేశారు. 70 ఏండ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్న రిజర్వేషన్లను రద్దు చేయాలని మోదీ చూస్తున్నారని అన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం లేదన్నారు. పార్లమెంటులో పూర్తి స్థాయి మెజార్టీ కోసమే అబ్ కీ బార్ చార్ సౌ పార్ అనే నినాదాన్ని అందుకే తెరమీదకు తెచ్చారని అన్నారు. బీసీ జనాభాను లెక్కించొద్దు అని ఎందుకు బీజేపీ అనుకుంటోందో మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా దేశ వ్యాప్తంగా కులగణన చేస్తామని చెప్పారని అన్నారు.
కారు జుమ్మరాత్ బజార్ కు
బీఆర్ఎస్ కారు షెడ్డుకు పోలేదని, జుమ్మరాత్ బజార్ కు పోయిందని, అందుకే కేసీఆర్ బస్సు ఏసుకొని బయల్దేరిండని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీజేపీకి 200 సీట్లు మాత్రమే వస్తాయని, సంకీర్ణ ప్రభుత్వంలో చేరతామని, నామా నాగేశ్వరరావును మంత్రిని చేస్తానని కేసీఆర్ చెబుతున్నారని అన్నారు. తాము ఇన్ని రోజుల నుంచి చెబుతున్నది కూడా అదేనిన బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య రహస్య ఒప్పందం ఉందంటున్నామని అన్నారు. చీకటి ఒప్పందం ప్రకారమే రెండు పార్టీలు కలిసి పోరాడుతున్నాయని అన్నారు.
ఇండియా కూటమిలోకి రానివ్వం
కేసీఆర్ ఇంటి మీది కాకిని ఇండియా కూటమిలోకి రానివ్వబోమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ ఇంటిమీది కాకి కాంగ్రెస్ గోడ మీద వాలితే తమ పార్టీ కార్యకర్తలు కాల్చి అవతల పారేస్తరని అన్నారు. కేసీఆర్ కుట్రలు గమనించిన సీపీఐ, సీపీఎం, జనసమితి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నాయని అన్నారు. రామప్ప దేవాలయలో ఉన్న శివుడి సాక్షిగా పంద్రాగస్టు నాటికి రైతాంగానికి రుణమాఫీ చేస్తానని చెప్పారు.
కల్యాణం కాకుండా అక్షింతలు ఎక్కడివి
అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కన్నా 15 రోజుల ముందే ఊరూరా అక్షింతలు పంచారని, ప్రతిష్టాపన కాకుండా అక్షింతలు ఎలా వచ్చాయని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఓట్ల కోసం రాముడిని బజార్లకు తీసుకొచ్చారని అన్నారు. మోదీ పార్లమెంటులో తల్లిని చంపి బిడ్డను బతికించినట్టుగా తెలంగాణ ఇచ్చారంంటుటే అక్కడే ఉన్న బండి సంజయ్ ఎందుకు నోరు మెదపలేదో సమాధానం చెప్పాలని అన్నారు. నరేంద్ర మోదీ తెలంగాణకు ఇచ్చిందేమీ లేదని, గాడిద గుడ్డు ఇచ్చినందకు నిజామాబాద్ లో గుండు, కరీంనగర్ లో అరగుండుకు ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రికి పోలీసులు నోటీసులిస్తే భయపడుకుంటూ ఢిల్లీకి పోతమనుకుంటుండ్రనని అన్నారు. ప్రధాన మంత్రి దిగజారి మాట్లాడుతున్నారని, దేశం లో ప్రజాస్వామ్యం కాపాడబడాలంటే, రాజ్యాంగం పది కాలాల పాటు నిలువాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి వెలిచాల రాజేందర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ALSO READ :

