HYD : కేటీఆర్ ఇలాకా సిరిసిల్ల కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఈ కేసులో తాను, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరం బాధితులమేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెద్దపల్లి, రామగుండం అభ్యర్థుల ఫోన్లనూ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. తన ఇంటికి సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద, గుడి వద్ద నుంచి ట్యాపింగ్ జరిగిందని అన్నారు. కరీంనగర్ లోని ప్రతిమ హోటల్ రూం నంబర్ 314 లో రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు మకాం వేసి ఈ తతంగం నడిపారని చెప్పారు. తనతో పాటు కాంగ్రెస్ పెద్దపల్లి, రామగుండం అభ్యర్థుల ఫోన్లను ట్యాప్ చేశారని చెప్పారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకే తాము ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు స్వయంగా రాధాకిషన్ రావు ఒప్పుకున్నారని తెలిపారు. అయినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ కేసు ఎందుకు పక్కకు పోయిందన్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి తో కేసీఆర్ చేసుకున్నచీకటి ఒప్పందం మేరకే కేసు పక్కదారి పట్టిందని సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ ఫ్యామిలీ సూచనలు, సలహాల మేరకే సదరు మంత్రి పనిచేస్తున్నారని చెప్పారు. ఫోన్ల ట్యాపింగ్ అనేది దేశభద్రతకు సంబంధించిన అంశమని, ఇంత జరిగినా కేసీఆర్, కేటీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గతంలో డ్రగ్స్, మియాపూర్ భూములు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు మాదిరిగానే ఫోన్ ట్యాపింగ్ కేసును మూసివేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
ALSO READ :
