Raghunandan Rao : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను

Raghunandan Rao

Raghunandan Rao : దుబ్బాక నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు, ఇంటి స్థలమున్న ప్రతి కుటుంబానికి రూ.7.50 లక్షలు మంజూరు చేస్తే రానున్న ఎన్నికల్లో పోటీ చేయనని మంత్రి కేటీఆర్‌‌కు ఎమ్మెల్యే రఘునందన్​రావు సవాల్ విసిరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ పరిధిలోని చెల్లాపూర్ వార్డులో ప్రజా గోస- బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేండ్లు గడుస్తున్నా ప్రజలకిచ్చిన హామీలను ఒక్కటీ పూర్తి చేయలేదని ఆరోపించారు.

దుబ్బాక నియోజకవర్గానికి నిధులు మంజూరు చేస్తే రఘునందన్​రావుకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని నిధులు ఇవ్వడంలేదని విమర్శించారు. ఎనిమిదేండ్లుగా నియోజకవర్గంలో అడుగు పెట్టని నాయకులు.. రఘునందన్​రావు గెలవగానే ఎందుకొస్తున్నారని ప్రశ్నించారు. ప్రొసీడింగ్స్ లేకుండా కుల సంఘాల భవనాలకు ఆగమేఘాల మీద వచ్చి కొబ్బరికాయలు కొట్టడడం దేనికి సంకేతమన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మంత్రి కేటీఆర్ ఎగతాళి చేయడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు.

రఘునందన్​ రావును ఎలా ఓడగొట్టాలని జిమ్మిక్కులు చేస్తున్నారని, నియోజకవర్గంపై నిజమైన ప్రేమ ఉంటే ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు, సొంత జాగలో ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు రూ.7.50 లక్షలు ఇస్తే తానే రానున్న ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని కేటీఆర్​కు దండ వేసి దండం పెడుతానని స్పష్టం చేశారు. తానెక్కడికి వెళ్లినా దళిత బంధు, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పించాలని లక్షలాది విజ్ఞప్తులు వస్తున్నాయని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేనోళ్లు ఏ మొఖం పెట్టుకుని రాష్ట్రంలో పర్యటిస్తారని ఎద్ధేవా చేశారు.