దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ కొరత తలెత్తే అవకాశం ఉందనే ఆందోళనల మధ్య (IRCTC) Indian Railway Catering and Tourism Corporation కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు అందించే ఆహార సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది.
రైల్వే స్టేషన్లలోని ఫుడ్ ప్లాజాలు, రిఫ్రెష్‌మెంట్ రూమ్‌లు, జన్ ఆహార్ కేంద్రాల్లో గ్యాస్ సిలిండర్ల వినియోగాన్ని తగ్గించాలని (IRCTC) ఐఆర్‌సీటీసీ ఆదేశాలు జారీ చేసింది. గ్యాస్‌కు బదులుగా మైక్రోవేవ్ ఓవెన్లు, ఇండక్షన్ స్టవ్‌లను ఉపయోగించాలని స్పష్టం చేసింది.
ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ఇంధన సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గ్యాస్ కొరత ఏర్పడినా కూడా ప్రయాణికులకు ఆహార సరఫరా నిలిచిపోకుండా చూడటం ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొన్నారు.
ఈ మేరకు దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో పనిచేస్తున్న క్యాటరింగ్ సంస్థలకు ప్రత్యేక సూచనలు పంపించారు. సాధ్యమైనంత వరకు ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా వంట చేయాలని సూచించారు.
అలాగే వండాల్సిన ఆహార పదార్థాల విషయంలో ఇబ్బందులు ఎదురైతే, ప్రయాణికుల కోసం రెడీ టు ఈట్ ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవాలని క్యాటర్లకు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే అందించేందుకు ఈ ఆహార పదార్థాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
మరోవైపు పరిస్థితులు మరింత క్లిష్టంగా మారితే రైళ్లలో వండిన భోజనం సరఫరా తాత్కాలికంగా నిలిచిపోవచ్చని సమాచారం. అలాంటి పరిస్థితి వస్తే ముందుగా భోజనం బుక్ చేసుకున్న ప్రయాణికులకు రీఫండ్ ఇవ్వాలనే ఆలోచనలో Railway Board ఉందని వర్గాలు వెల్లడించాయి.
ఈ చర్యల ద్వారా ఎలాంటి పరిస్థితుల్లోనైనా రైల్వే ప్రయాణికులకు ఆహార సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Also read:

