Jana Nayagan: రిలీజ్ డేట్ ఫిక్స్?

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా అగ్రస్థానాన్ని అందుకున్న విజయ్, రాజకీయ రంగ ప్రవేశంతో సినిమాలకు గుడ్‌బై చెప్పాలని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అలాంటి విజయ్ కెరీర్‌లో చివరి చిత్రంగా(Jana Nayagan) తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మూవీ ‘జన నాయగన్’పై ఇప్పుడు అనిశ్చితి ముసురుకుంది. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం మొదట సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా, అనూహ్యంగా సెన్సార్ సమస్యలు తలెత్తడంతో రిలీజ్ పూర్తిగా వాయిదా పడింది. రాజకీయ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జన నాయగన్’(Jana Nayagan)ను కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. విజయ్ రాజకీయ భావజాలాన్ని ప్రతిబింబించే కథతో ఈ సినిమాను రూపొందించినట్లు మొదటి నుంచే ప్రచారం జరిగింది. సామాన్య ప్రజల సమస్యలు, వ్యవస్థలోని లోపాలు, రాజకీయ నాయకుల బాధ్యతలపై గట్టిగానే ప్రశ్నలు లేవనెత్తే విధంగా కథనం సాగుతుందన్న టాక్ కోలీవుడ్‌లో వినిపించింది. ఈ నేపథ్యమే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) అభ్యంతరాలకు కారణమైందని సమాచారం.

సెన్సార్ బోర్డు సభ్యులు సినిమాలోని కొన్ని రాజకీయ డైలాగులు, సన్నివేశాలు సమాజంపై ప్రభావం చూపే విధంగా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రజా వ్యవస్థలపై నేరుగా వ్యాఖ్యలు చేసే కొన్ని సన్నివేశాలు, రాజకీయ సంకేతాలు ఇచ్చే డైలాగులపై బోర్డు తీవ్రంగా స్పందించినట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో సినిమా విడుదలపై ఒక్కసారిగా అనిశ్చితి నెలకొంది.

Image

ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ‘జన నాయగన్’ విడుదలపై కొత్త ఆశలు మొదలయ్యాయి. కోలీవుడ్‌లో వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం, మేకర్స్ మరోసారి సినిమాను సెన్సార్‌కు పంపేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. దాదాపు 20 నిమిషాల కీలక ఫుటేజ్‌ను తొలగించడం, కొన్ని సున్నితమైన డైలాగులను మ్యూట్ చేయడం, మరికొన్ని సన్నివేశాలకు మార్పులు చేయడం వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ఈ మార్పులతో సెన్సార్ బోర్డు అభ్యంతరాలను అధిగమించి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నదే నిర్మాతల ప్రయత్నంగా కనిపిస్తోంది.

అన్ని అనుకున్నట్లుగా జరిగితే, ‘జన నాయగన్’ను ఫిబ్రవరి 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇది విజయ్ అభిమానులకు కొంత ఊరట కలిగించే వార్తే అయినప్పటికీ, చివరి క్షణం వరకూ సెన్సార్ అంశం తేలే వరకు స్పష్టత రానుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లోకి ప్రవేశించే ముందు విజయ్ చెప్పాలనుకున్న మాటలు ఈ సినిమాలో ఎంతవరకు ప్రేక్షకులకు చేరుతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఏదేమైనా, ‘జన నాయగన్’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, విజయ్ రాజకీయ ప్రయాణానికి ముందు చెప్పే చివరి సినీ సందేశంగా మారనుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అందుకే ఈ సినిమాపై నెలకొన్న సెన్సార్ వివాదం, విడుదల తేదీపై కొనసాగుతున్న ఉత్కంఠ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

Also Read :