KA Paul : ఢిల్లీ లిక్కర్ స్కాంలో రేపో మాపో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయడం ఖాయమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు. ఈ స్కాం దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు చెప్పారు. ఆదివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. లిక్కర్ స్కాంలో కవిత, సోడియాలను అరెస్ట్ చేయాలని కోరేందుకు సీబీఐ కార్యాలయానికి వెళ్లినట్లు చెప్పారు.
ఆదివారం సెలవు కావడంతో సోమవారం రావాలని సిబ్బంది సూచించారన్నారు. లిక్కర్ స్కాం వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసని, ఆలస్యం చేస్తే ఈ కేసుకు రాజకీయాలు అంటగడతారని చెప్పారు. కేసీఆర్ తనకున్న డబ్బుతో అవినీతిని కనపడనీయకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఆరు నెలల్లో తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

