(Lamborghini) లగ్జరీ కారు కొనడం చాలామందికి జీవితంలో ఒక పెద్ద కల. అలాంటి కలను నిజం చేసుకున్న ఓ హైదరాబాద్ కుటుంబం చేసిన పూజ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. రూ.4 కోట్ల విలువైన (Lamborghini) లాంబోర్గినీ హురాకాన్ కొనుగోలు చేసిన సందర్భంలో నిర్వహించిన సంప్రదాయ పూజ అనుకోకుండా వైరల్ ఘటనగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన ఈ వీడియోకు ఇప్పటికే 7 కోట్ల 63 లక్షలకు పైగా వ్యూస్ రావడం విశేషం. లక్షల సంఖ్యలో లైకులు, వేలాది కామెంట్లతో ఈ వీడియో ట్రెండింగ్‌లో నిలిచింది.వీడియోలో లాంబోర్గినీ కారును ఇంటి ముందుకు తీసుకొచ్చి పూజ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కారు యజమాని తల్లి సంప్రదాయబద్ధంగా పూజ చేస్తున్నారు. కర్పూరం వెలిగించి, కొబ్బరిని చేతిలో పట్టుకుని ఆశీర్వాద క్రియలు నిర్వహిస్తున్నారు. కర్పూరం పెట్టేందుకు ఎక్కడ ఉంచాలా అని కారు వైపు చూస్తారు. ఈ సమయంలో పక్కనే ఉన్న పూజారి కారు మీద కాకుండా ఇసుకపై కర్పూరం పెట్టాలని సూచిస్తారు. అంతా సాధారణంగానే సాగుతుందని అందరూ భావించారు.
అయితే అసలు ట్విస్ట్ అక్కడే వచ్చింది. కొబ్బరి కొట్టే సమయంలో అనుకోని ఘటన జరిగింది. ఆమె విసిరిన కొబ్బరి నేలపై తాకి ఒక్కసారిగా దూకింది. నేరుగా లాంబోర్గినీ కారు హెడ్‌లైట్ వైపు వెళ్లింది. ఆ క్షణంలో అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. తల్లి, పూజారి ఇద్దరూ ఒక్కసారిగా భయపడినట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో అక్కడితో ముగియడంతో అసలు కారుకు ఎంత నష్టం జరిగిందన్నది తెలియకుండా పోయింది.కారుకు స్వల్ప గీత పడిందా. లేక పెద్ద డ్యామేజ్ ఏమీ కాలేదా అన్న విషయం ఇంకా స్పష్టతకు రాలేదు. అయినా ఈ చిన్న సంఘటన సోషల్ మీడియాలో పెద్ద ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారింది. నెటిజన్లు తమదైన శైలిలో సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. “అమ్మ చేతి దెబ్బ అయితే లాంబోర్గినీ అయినా సరే” అంటూ కొందరు నవ్వులు పూయించారు. “అమ్మ ముందు వంద కార్లు అయినా త్యాగమే” అంటూ మరికొందరు కామెంట్లు పెట్టారు. “మినీ హార్ట్ అటాక్ కారుకి కాదు. అమ్మకి ఏమైనా అయ్యేదేమో అన్న భయమే” అంటూ భావోద్వేగంగా స్పందించినవారూ ఉన్నారు.
కొంతమంది “లాంబోర్గినీ కూడా అమ్మ ముందు బలహీనపడింది” అంటూ జోకులు పేల్చారు. మరికొందరు మాత్రం సంప్రదాయ పూజలను గౌరవించాలి అని వ్యాఖ్యానించారు. డబ్బు ఎంత ఉన్నా సంప్రదాయం, నమ్మకాలు మారవని ఈ వీడియో నిరూపించిందని అభిప్రాయపడ్డారు. ఈ ఘటన లగ్జరీ లైఫ్‌స్టైల్‌కు, భారతీయ సంప్రదాయాలకు మధ్య ఉన్న ఆసక్తికరమైన కలయికగా మారింది.ఇక లాంబోర్గినీ హురాకాన్ గురించి మాట్లాడితే, ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ కార్లలో ఒకటి. హురాకాన్ ఈవో స్పైడర్, టెక్నికా, ఎస్‌టీఓ, స్టెరాటో అనే నాలుగు వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉంది. కార్బన్ అణువుల హెక్సాగనల్ డిజైన్ నుంచి ప్రేరణ పొందిన దీని డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఫుల్ ఎల్‌ఈడీ లైటింగ్ సిస్టమ్ దీనికి ఆధునిక లుక్ ఇస్తుంది.ఈ సూపర్‌కార్ కేవలం నాలుగు సెకన్లలోపు సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. శక్తివంతమైన ఇంజిన్, అత్యాధునిక టెక్నాలజీ దీని ప్రత్యేకత. అలాంటి ఖరీదైన కారుకు సంబంధించిన చిన్న వీడియో ఇలా వైరల్ అవడం సోషల్ మీడియా శక్తిని మరోసారి చూపించింది.
Also read:

