రాజస్థాన్లోని దీగ్ జిల్లాలో పురావస్తు శాఖ తవ్వకాల్లో సుమారు 4,500 సంవత్సరాల క్రితం నాటి పురాతన నాగరికతకు సంబంధించిన అద్భుతమైన ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఋగ్వేదంలో ప్రస్తావించిన సరస్వతీ నదికి(Saraswati River) సంబంధించిన పురాతన ప్రవాహ మార్గం బయటపడటం ఆసక్తిని రేపుతోంది. బహాజ్ గ్రామంలో గత ఏడాది జనవరి 10న ఏఎస్ఐ తవ్వకాలను ప్రారంభించింది. సుమారు 23 మీటర్ల లోతు వరకు జరిపిన ఈ పరిశోధనలు.. రాజస్థాన్ చరిత్రలోనే అత్యంత లోతైనవిగా నిలిచాయి. నాటి సరస్వతీ నది పురాతన ప్రవాహ మార్గం మహాభారత కాలంతో పాటు ఐదు వేర్వేరు యుగాలకు చెందిన 800కు పైగా పురావస్తు కళాఖండాలు, అరుదైన ఎముకల పనిముట్లు లభించాయి. హరప్పా అనంతర కాలం, మహాభారత కాలం, మౌర్యుల కాలం, కుషాణుల కాలం, గుప్తుల కాలం నాటి నాగరికతలు ఇక్కడ విలసిల్లినట్లు స్పష్టమైంది. ముఖ్యంగా మహాభారత కాలం నాటి పొరల్లో లభించిన మట్టిపాత్రలు, యజ్ఞ కుండాలు ఆనాటి పరిస్థితులను కళ్లకు కడుతున్నాయి. ఈ మట్టిపాత్రలపై ఉన్న చిత్రాలు, మహాభారతంలో వర్ణించిన వస్త్రాలు, పాత్రలను పోలి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నదీ(Saraswati River) తీరంలోనే తొలినాటి మానవ ఆవాసాలు ఏర్పడి, మధుర, బ్రజ్ ప్రాంతాలతో సాంస్కృతిక సంబంధాలు కొనసాగించి ఉంటాయని ఏఎస్ఐ సైట్ హెడ్ పవన్ సారస్వత్ తెలిపారు. సూదులు, దువ్వెనలు, అచ్చులు వంటి ఎముకలతో చేసిన పనిముట్లు ఈ రూపంలో దేశంలో లభించడం ఇదే తొలిసారి అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
Also Read :

